రాష్ట్రంలో చాలా చోట్ల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
రానున్న రోజుల్లో వడగాలులు మరింత పెరిగే అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకీ ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత అధికం అవుతోంది. దీనికితోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. వైఎస్సార్ కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తేరన్నపల్లెలో 42.3, కర్నూలు జిల్లా గూడూరులో 42.1, పల్నాడు జిల్లా దుర్గిలో 41.8, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6, మార్కాపురం జిల్లా అనుమలపల్లి, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 41.2, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
మున్ముందు మరింత తీవ్రం
వచ్చే వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, దక్షిణ కోస్తాలోని శ్రీపొట్టిశ్రీరాములు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.


