రఘురామ పర్యటనతో టెన్షన్‌! | Intense tension in Akividu Pedapeta during visit of Raghurama Krishna Raju | Sakshi
Sakshi News home page

రఘురామ పర్యటనతో టెన్షన్‌!

Mar 28 2026 2:15 AM | Updated on Mar 28 2026 2:15 AM

Intense tension in Akividu Pedapeta during visit of Raghurama Krishna Raju

మందీమార్బలంతో డిప్యూటీ స్పీకర్‌ హడావుడి..

ఆకివీడు పెదపేటలో తీవ్ర ఉద్రిక్తత

రఘురామ అనుచరులు దాడిచేశారంటున్న దళితులు

పలువురికి గాయాలు.. పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు..

57 మందిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు..

సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. డిప్యూటీ స్పీకర్‌ వెంట వచ్చిన కూటమి కార్యకర్తలు తమపై దాడిచేశారని స్థానిక దళితులు ఆందోళనచేశారు. ఈ గొడవ పేరుతో పలువురిని స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా­రని, పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని వారు పేర్కొన్నారు. 

ఆకివీడులోని పెదపేటలో దళితుల నివాసాల మధ్య ఉన్న ఓ ఆలయంలో రఘురామకృష్ణరాజు పూజలు చేయడానికి శుక్రవారం వచ్చారు. ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, వారంతా ఏదో దాడికి వచ్చినట్లు హడావిడి చేయడం, ఆ ప్రాంతంలోని దళితులు  నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. 

డిప్యూటీ స్పీకర్‌ మందీమార్బలం హడావుడి..
శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ మందీమార్బలాన్ని వేసుకుని హడావుడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.  ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ఆ ప్రాంత దళిత మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రఘురామ పర్యటన నేపథ్యంలో అక్కడ డీఎస్పీ రఘువీర్‌ విష్ణు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

57 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
రఘురామ వెంట వచ్చిన వారు దురుసుగా వ్యవహరించడంతోనే ఘర్షణ తలెత్తిందని స్థానికులు పేర్కొన్నారు. దాంతో తోపులాటకు దారితీసిందని, ఈ ఘటనలో పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం పెదపేటలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. 

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయంత్రం వేళ తిరిగి ఆ ప్రాంతానికి చేరుకుని 57 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లేకపోవడం, ఎక్కడికి తరలించారనే సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement