ఔను.. వాళ్లిద్దరూ కలెక్టర్లయ్యారు

Inspirational Story Of Wife And Husband Become District Collector Srikakulam - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కష్టపడి చదివారు. కుటుంబాలకు అండగా నిలిచారు. ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. సిక్కోలు కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. జిల్లాకు చెందిన ఢిల్లీరావు, ప్రశాంతి దంపతులు కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలెక్టర్లుగా వీరిని నియమించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జీవితంలో ఒక్కో దశను దాటుకుంటూ ఉన్నత స్థానాలకు చేరిన వీరి ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం. 

విజయనగరంలోనే ప్రేమ
గ్రూప్‌ 1కు ఎంపిౖకైన తర్వాత హెచ్‌ఆర్‌డీఏలో శిక్షణ పొందుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విజయనగరంలో ఉన్నప్పుడే 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రస్తుతం ప్రశాంతి తల్లిదండ్రులతో పాటు ఢిల్లీరావు తల్లి కూడా వారి వద్దే ఉంటున్నారు. 

మధ్య తరగతి కుటుంబం నుంచి..       
కలెక్టర్‌ ప్రశాంతి తండ్రి తొలుత తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. తల్లి గృహిణి. ప్రశాంతి సోదరుడు నేపాల్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ఆర్గనైజేషన్‌లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం జలుమూరే అయినా సింహాచలంలో స్థిరపడ్డారు. ఆమె నరసన్నపేట, మాడుగుల, విశాఖ బీవీకే కళాశాల, కృష్ణా కళాశాల, ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎంఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చేసిన ఆమె కృష్ణా కళాశాలలో తొలుత లెక్చరర్‌గా పనిచేశారు.

సివిల్స్‌ సర్వీసు కోసం చదువుతూ 2007లో గ్రూప్‌ 1కు ఎంపికయ్యారు. పార్వతీపురం ఆర్డీఓగా తొలి పోస్టు సాధించారు. ఆ తర్వాత విజయనగరంలో కేఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, హౌసింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి బదిలీపై పులిచింతల ఎస్‌డీసీగా, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లా డీఆర్‌డీఏ, డ్వామా పీడీగా పనిచేశారు. తర్వాత నెల్లూరు స్పెషల్‌ కలెక్టర్‌గా, అనంతపురం, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2014లో ఐఏఎస్‌ పదోన్నతి సాధించారు. గుంటూరు జేసీ గా, చీఫ్‌ సెక్రటరీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ టూ సీఎస్‌ బాధ్య తలు చేపట్టారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.  

నిరుపేద కుటుంబంలో పుట్టి.. 
కలెక్టర్‌ ఢిల్లీరావుది మందస మండలం పిడి మందస గ్రామం. ఆయన ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. ఐదు నుంచి 10వ తరగతి వరకు సింహాచలం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివారు. ఇంటర్‌ శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో చదవగా, అగ్రికల్చర్‌ డిగ్రీ శ్రీకాకుళం నైరాలో, బాపట్లలో పీజీ చేశారు. ఆయన ఇంటర్‌ చదువుతున్న ఏడాదిలోనే తండ్రి చనిపోయారు. దీంతో తల్లి ఆ కుటుంబాన్ని తన రెక్కల కష్టంతో నెట్టుకువచ్చారు. అలాగే ఢిల్లీరావుకు తన చిన్ననాటి స్నేహితుడు మాధవరావు ఎంతో సాయం చేశా రు. ఢిల్లీరావుకు అక్క, తమ్ముడు ఉన్నారు.

కష్టపడి చదువుకున్న ఢిల్లీరావు తొలుత ఐకార్‌లో సైంటిస్టుగా ఎంపికయ్యారు. 2003 నుంచి 2007 వరకు షిల్లాంగ్, కోహిమలో పనిచేశారు. సివిల్‌ సర్వీసుకు ఎంపికవ్వాలన్న లక్ష్యంతో అక్కడితో ఆగిపోకుండా ప్రిపేర య్యారు. 2007లో గ్రూప్‌ 1కు ఎంపికయ్యారు. విజయనగరంలోనే శిక్షణ పొందిన ఢిల్లీరావు తొ లుత విజయనగరం ఆర్డీఓగా, తర్వాత గుంటూ రు ఆర్డీఓగా, అనంతపురం, గుంటూరు, విజయనగరంలో డ్వామా, డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో 2013లో ఐఏఎస్‌ పదోన్నతి సాధించారు. నెల్లూరు మున్సిపల్‌ క మిషనర్‌గా, అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన ఢిల్లీరావు తర్వాత సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ పోస్టులో ఉండగా తాజా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడి ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాకు కలెక్టర్‌గా నియమితులయ్యారు.

చదవండి: టీచర్‌ నుంచి పోలీస్‌ వరకు.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top