రైల్వే మార్గాలపై వన్యప్రాణుల మృత్యుఘోషకు చెక్
ప్రమాదాలు నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం
ఈ వ్యవస్థతో రైల్వే ట్రాక్‌లపై వన్యప్రాణుల ఉనికి ముందే గుర్తింపు
వెంటనే లోకో పైలట్, స్టేషన్ మాస్టర్‌లకు సమాచారం
తద్వారా ప్రమాదాల నివారణ
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వే మార్గాలపై ఏనుగులు, ఇతర వన్యప్రాణులను ప్రమాదాల బారి నుంచి కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని రైల్వే మార్గాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులూ మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌లకు సమీపంలో వాటి ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా గుర్తిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డి్రస్టిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ (డీఏఎస్)తో రైల్వే ట్రాక్‌లపై వీటి ఉనికిని గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ట్రాక్ సమీపంలోకి ఏనుగులు, ఇతర వన్యప్రాణులు వస్తే ఈ వ్యవస్థ వాటి కదలికలను లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందికి హెచ్చరిక జారీ చేస్తోంది. దీంతో సకాలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటికే 141 రూట్ కిలోమీటర్లలో అమలు..
ప్రస్తుతం ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను రైల్వేలోని 141 రూట్ కిలోమీటర్ల మేరకు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఈ వ్యవస్థను మరో 981 రూట్ కిలో మీటర్లలో విస్తరించేందుకు టెండర్లను ఆహా్వనించినట్లు తెలిపింది. వన్యప్రాణుల మరణాలపై 127 రైల్వే మార్గాల్లో 3,452.4 కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించింది. దీని ద్వారా ఏనుగుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 110 రైల్వే మార్గాలను, పులుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 17 రైల్వే మార్గాలను గుర్తించింది. తక్షణం నష్ట నివారణకు 14 రాష్ట్రాల్లో 77 రైల్వే మార్గాల్లో 1,965.2 కిలో మీటర్ల మేర పలు నిర్మాణాలను చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.
రైల్వే ప్రమాదాల బారి నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు 503 లెవెల్ క్రాసింగ్‌లు, ర్యాంపుల నిర్మాణం, 72 చోట్ల వంతెనల విస్తరణ, మార్పు, 39 చోట్ల కంచె, బారికేడింగ్, కందకాల నిర్మాణం, నాలుగు నిష్క్రమణ ర్యాంపులు, 65 కొత్త అండర్ పాస్‌లు, 22 ఓవర్‌పాస్‌ల నిర్మాణాలను చేపడుతున్నట్లు వివరించింది. రైలు ప్రమాదాల్లో 2020–21 నుంచి 2024–25 వరకు 79 ఏనుగులు మృత్యువాత పడినట్లు తెలిపింది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, కేరళ, ఒడిశా ,త్రిపుర, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మృతి చెందుతున్నట్లు పేర్కొంది.


