2047 నాటికి నేవీకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం 

Indian Navy Chief Admiral Harikumar says Indigenous knowledge 2047 - Sakshi

భారత నావికాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌ 

నిర్మాణంలో 43 యుద్ధనౌకలు, జలాంతర్గాములున్నట్టు వెల్లడి 

నౌకానిర్మాణ ప్రాజెక్టుల ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు 

రూ.2,230 కోట్లతో రెండు డీఎస్‌వీలను నిరి్మంచిన విశాఖ హెచ్‌ఎస్‌ఎల్‌  

వాటికి నిస్తార్, నిపుణ్‌గా నామకరణం 

హర్షధ్వానాల మధ్య జల ప్రవేశం 

సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం 2047 నాటికల్లా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటుందని నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ చెప్పారు. ఆ తర్వాత ఆత్మనిర్భర్‌తో నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానం ద్వారా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో రూ.2,230 కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు డైవింగ్‌ సపోర్టు వెసల్స్‌(డీఎస్‌వీల) జల ప్రవేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత సముద్ర జలాల్లో దేశ రక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు.

దేశవ్యాప్తంగా కొత్తగా 45 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 43 నిర్మాణంలో ఉన్నాయన్నారు. నౌకా నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగినట్టు తెలిపారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ డీఎస్‌వీలను తొలిసారిగా నేవీ కోసం విశాఖ హిందుస్తాన్‌ షిప్‌యార్డు నిర్మించిందని, వీటికి అవసరమైన పరికరాలను దేశంలోని 120 ఎంఎస్‌ఎంఈలు సమకూర్చినట్టు చెప్పారు.

జలాంతర్గాముల్లో సమస్యలు తలెత్తినప్పుడు సరిచేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా సిబ్బందిని రక్షించేందుకు కొత్త డీఎస్‌వీ వెసల్స్‌ ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోకొచ్చాక డీప్‌ సీ డైవింగ్‌ ఆపరేషన్లలో కొత్త శకం ఆరంభమవుతుందన్నారు. హెచ్‌ఎస్‌ఎల్‌ సీఎండీ హేమంత్‌ ఖాత్రి మాట్లాడుతూ తమ నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 200 నౌకలను నిర్మించిందని, 2000 నౌకలకు మరమ్మతులు చేసిందని వెల్లడించారు. 2021–22 ఆరి్థక సంవత్సరంలో రూ.755 కోట్ల టర్నోవర్‌ సాధించి, రూ.51 కోట్ల లాభాలనార్జించిందని వివరించారు.   

నిస్తార్, నిపుణ్‌లుగా నామకరణం 
కొత్తగా నిర్మించిన డీఎస్‌వీలకు నిస్తార్, నిపుణ్‌లుగా భారత నావికా దళాధిపతి సతీమణి కళాహరికుమార్‌ నామకరణం చేశారు. తొలుత ఆమె రెండు వెసల్స్‌కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం నేవీ చీఫ్‌ హరికుమార్‌తో కలిసి ఆమె రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నిస్తార్, నిపుణ్‌లపై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆ వెంటనే వాటిని హర్షధ్వానాల మధ్య జలప్రవేశం చేయించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ బి.దాస్‌గుప్తా, నేవీ, షిప్‌యార్డు ఉన్నతాధికారులు, హెచ్‌ఎస్‌ఎల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top