breaking news
hindustan shipyard ltd
-
2047 నాటికి నేవీకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం 2047 నాటికల్లా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటుందని నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. ఆ తర్వాత ఆత్మనిర్భర్‌తో నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానం ద్వారా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో రూ.2,230 కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు డైవింగ్ సపోర్టు వెసల్స్(డీఎస్వీల) జల ప్రవేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత సముద్ర జలాల్లో దేశ రక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్తగా 45 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 43 నిర్మాణంలో ఉన్నాయన్నారు. నౌకా నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగినట్టు తెలిపారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ డీఎస్‌వీలను తొలిసారిగా నేవీ కోసం విశాఖ హిందుస్తాన్ షిప్‌యార్డు నిర్మించిందని, వీటికి అవసరమైన పరికరాలను దేశంలోని 120 ఎంఎస్ఎంఈలు సమకూర్చినట్టు చెప్పారు. జలాంతర్గాముల్లో సమస్యలు తలెత్తినప్పుడు సరిచేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సిబ్బందిని రక్షించేందుకు కొత్త డీఎస్వీ వెసల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోకొచ్చాక డీప్ సీ డైవింగ్ ఆపరేషన్లలో కొత్త శకం ఆరంభమవుతుందన్నారు. హెచ్ఎస్ఎల్ సీఎండీ హేమంత్ ఖాత్రి మాట్లాడుతూ తమ నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 200 నౌకలను నిర్మించిందని, 2000 నౌకలకు మరమ్మతులు చేసిందని వెల్లడించారు. 2021–22 ఆరి్థక సంవత్సరంలో రూ.755 కోట్ల టర్నోవర్ సాధించి, రూ.51 కోట్ల లాభాలనార్జించిందని వివరించారు. నిస్తార్, నిపుణ్‌లుగా నామకరణం కొత్తగా నిర్మించిన డీఎస్‌వీలకు నిస్తార్, నిపుణ్‌లుగా భారత నావికా దళాధిపతి సతీమణి కళాహరికుమార్ నామకరణం చేశారు. తొలుత ఆమె రెండు వెసల్స్‌కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం నేవీ చీఫ్ హరికుమార్‌తో కలిసి ఆమె రిమోట్ కంట్రోల్ ద్వారా నిస్తార్, నిపుణ్‌లపై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆ వెంటనే వాటిని హర్షధ్వానాల మధ్య జలప్రవేశం చేయించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తా, నేవీ, షిప్‌యార్డు ఉన్నతాధికారులు, హెచ్ఎస్ఎల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వరంగ సంస్థలపై ఆంధ్రాబ్యాంక్ దృష్టి
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక మందగమనం వల్ల కార్పొరేట్ రుణాలకు డిమాండ్ తక్కువగా ఉండటంతో ప్రభుత్వరం సంస్థలపై ఆంధ్రాబ్యాంక్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)కు రూ.300 కోట్ల రుణం మంజూరు చేయనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ తెలిపారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశాఖ పర్యటనకు వచ్చిన రాంజేంద్రన్ తెలిపారు. హౌసింగ్, అగ్రికల్చర్, గోల్డ్, చిన్నతరహా పరిశ్రమల రుణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.50 లక్షల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే రెండు నెలల్లో రూ. 20 వేల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మొండిబకాయిలు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయని, ప్రస్తుతం ఇవి 5 శాతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఏటీఎంలకు భద్రత పెంచాల్సిందేనని ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో నెలకు ఒక్కో ఏటీఎంకు సుమారుగా రూ.45వేలకుపైగా ఖర్చవుతోందని, ఇది వినియోగదారులపై ఎంతవరకు మోపాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా తాముకూడా ఏటీఎంల్లో కొత్తకొత్త సర్వీసులు ప్రారంభించామని, ఇదికాక మరో 150 నవశక్తి బ్యాంకులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.