ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలే | India Meteorological Department On summer temperatures 2023 | Sakshi
Sakshi News home page

ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలే

Mar 2 2023 3:21 AM | Updated on Mar 2 2023 3:21 AM

India Meteorological Department On summer temperatures 2023 - Sakshi

సాక్షి, అమరావతి: ఈ వేసవిలో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఎండల తీవ్రత పెరుగుతుందని, వర్షాభావం నెలకొంటుందని కొన్ని ప్రైవేటు వాతావరణ సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ భారత వాతావరణశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఎల్‌నినో ప్రభావం ఉన్నట్లు నిర్థారించలేదు.

గత మూడు, నాలుగేళ్లుగా కొనసాగుతున్న లానినో బలహీనపడుతోందని, అదే సమయంలో ఎల్‌నినో న్యూట్రల్‌గా ఉందని స్పష్టం చేసింది. లానినో ఉంటే విస్తృతంగా వర్షాలు పడతాయి. ఎల్‌నినో ఉంటే వర్షాభావం నెలకొని కరువు పరిస్థితులు ఏర్పడతాయి. వాతావరణశాఖ తాజా నివేదికలో ఎల్‌నినో న్యూట్రల్‌గా ఉందని చెప్పిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయి. అంటే గత సంవత్సరంలో ఉన్న వాతావరణ పరిస్థితులే ఈసారి ఉండే అవకాశం ఉంది.

44 నుంచి 46 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇవేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో హీట్‌వేవ్‌ ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా అక్కడక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలిగాలులు కూడా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే ఉంటున్నాయి. వచ్చే 10–15 రోజుల్లో ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement