దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపు
టన్నుకు వెనామీ ఫీడ్‌పై రూ.10వేలు
టైగర్ ఫీడ్‌పై రూ.12వేలు చొప్పున పెంపు
ధరల పెంపుపై కుదరని ఏకాభిప్రాయం.. టన్నుకు రూ.6వేల పెంపునకు అంగీకరించిన టీడీపీ అనుకూల రైతులు
ఏమాత్రం అంగీకరించబోమని తెగేసి చెప్పిన ఆక్వా రైతులు
అయినా పట్టించుకోని ఫీడ్ తయారీ కంపెనీలు
ఏకపక్షంగా ధరలు పెంచేసిన టీడీపీ నేతల కంపెనీలు
అప్సడాతో సంబంధం లేకుండా మొండిగా నిర్ణయం
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’వన్నె పులులు తెగపడ్డాయి. ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు బరితెగించాయి. ఏకపక్షంగా మేత ధరలను పెంచేశాయి. ఆక్వా రంగ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా టన్నుకు వెనామీ ఫీడ్‌పై రూ.10వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.12 వేలు చొప్పున పెంచాయి. ఈ పెంపు శనివారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించాయి.
తొలుత టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావుకు చెందిన బీఏంఆర్ కంపెనీతోపాటు టీడీపీ నేతలకే చెందిన అవంతి ఫీడ్స్ కంపెనీలు ధరలను పెంచుతూ ప్రకటనలు విడుదల చేయడంతో ఇదే బాటలో మిగిలిన కంపెనీలూ ఒకదాని తర్వాత మరొకటి ప్రకటనలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆది నుంచి మేత తయారీదారులతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఫీడ్ ధరల పెంపునకు పచ్చజెండా ఊపడంతో ఆక్వా రైతులు మండిపడుతున్నారు.
అప్సడా చట్టానికి తూట్లు
నిబంధనల ప్రకారం.. ధరల పెంపు అనివార్యమైతే అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై నిర్ణయించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టానికి రెండేళ్లుగా తూట్లు పొడుస్తోంది. రొయ్య రైతుల అంగీకారం లేకుండానే కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే రీతిలో టన్నుకు రూ.4వేల చొప్పున ధరలు పెంచేశాయి.
తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వెనామీ ఫీడ్‌పై రూ.12వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.14వేలు పెంచేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏప్రిల్ 30న మత్స్యశాఖ కమిషనర్‌కు రొయ్య మేత తయారీదారుల సంఘం లేఖ రాసింది. రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకుందామని కమిషనర్ చెప్పారు.
కానీ పట్టించుకోకుండా మే 11న వెనామీ ఫీడ్‌పై రూ.8,420, టైగర్ ఫీడ్‌పై రూ.10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. దీంతో ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ఆ వెంటనే «మత్స్యశాఖ మంత్రి అచ్చెన్ననాయుడు స్పందించి ఆక్వా రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోరడంతో తాత్కాలికంగా కంపెనీలు పెంపును వాయిదా వేశాయి.
రైతులు వ్యతిరేకిస్తున్నా..
మే 15న సచివాలయంలో అప్సడా ఆధ్వర్యంలో రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి మంత్రి అచ్చెన్న కావాలనే డుమ్మా కొట్టారు. రైతులు మేత ధరల పెంపును వ్యతిరేకించారు. సరిగ్గా ఇదేసమయంలో ధరల పెంపునకు వత్తాసు పలుకుతూ సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య మంత్రికి లేఖ రాయడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 9న మంత్రి అచ్చెన్న సమక్షంలో మరోసారి టీడీపీ అనుకూల రైతులతో కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. టీడీపీ అనుకూల రైతులు నెల పాటు రూ.6వేలు పెంపునకు అంగీకరించారు. దీన్ని ఆక్వా రైతులు వ్యతిరేకించారు. అయినా శుక్రవారం రాత్రి బీఎంఆర్, అవంతి, ఫెడోరో, నెక్స్‌జెన్ కంపెనీలు భారీగా మేత ధరలు పెంచేస్తూ ప్రకటనలు చేశాయి. మిగిలిన కంపెనీలు ఇదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి.
భారీగా పెరగనున్న ఉత్పత్తి వ్యయం
2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, శుక్రవారం మేత ధరలు పన్నులతో కలిపి టన్నుకు వెనామీ ఫీడ్ 1,01,720 కాగా, టైగర్ ఫీడ్ రూ.1,12,520గా ఉంది. శనివారం నుంచి పెరిగిన ధరలతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.3 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.4 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు.


