గోదావరి, కృష్ణా నదుల్లో రోశయ్య అస్థికల నిమజ్జనం

Immersion of Roshaiya ashes in Godavari and Krishna rivers - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న దేవదాయ శాఖ మంత్రి   

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం గోదావరి, కృష్ణా నదుల్లో నిమజ్జనం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిలో,  అలాగే విజయవాడ మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఉన్న వీఐపీ ఘాట్‌లో కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఆయన కుమారులు కేఎస్‌ శివసుబ్బారావు, కేఎస్‌ఎన్‌ మూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య విశేష సేవలందించారని కొనియాడారు.

ఆయన వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా రోశయ్య వద్దకు వెళ్తే పరిష్కారమవుతుందనే బలమైన నమ్మకం ఉండేదన్నారు. సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ ఆసిఫ్, ఏపీ ఇండస్ట్రీస్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌  పుణ్యశీల, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top