యువతలో పెరుగుతున్న హైపర్‌ టెన్షన్‌

Hypertension on the rise in youth - Sakshi

రక్తపోటు బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సర్వే 

ఆరోగ్య సలహాలతో పాటు ఉచితంగా మందులు 

లబ్బీపేట (విజయవాడ తూర్పు):  హైపర్‌ టెన్షన్‌ (బ్లడ్‌ ప్రెజర్‌).. యువత గుండెలను సైలెంట్‌గా పట్టేస్తోంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తోంది. క్యాన్సర్‌లకూ కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే హైపర్‌టెన్షన్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రక్తపోటుతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి తోడు కుటుంబ డాక్టర్‌ కార్యక్రమంలో సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  

ప్రత్యేక కార్యక్రమం ఇలా... 
ఇండియా హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనిషియేటివ్‌ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు బాధితులను గుర్తించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మూ­డేళ్ల క్రితం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చిం­ది. తొలుత ఉమ్మడి కృష్ణాను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టగా.. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లా­ల్లో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రక్తపోటుపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు.

రక్తపోటు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స అందేలా చూడటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. పట్టణ ప్రజలు ఎక్కువగా రక్తపోటుకు గురవుతున్నట్టు గుర్తించిన ప్ర­భుత్వం తొలుత  పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు సీహెచ్‌సీల్లో అమలు చేస్తున్నారు.  

వరంలా మారిన వెల్నెస్‌ సెంటర్లు.. 
ఒకప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలంటే గ్రామీణులు దూర ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారి ఇంటి సమీç­³ంలోనే వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు (వెల్నెస్‌ సెంటర్స్‌) అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీపీ చెక్‌ చేయించుకునేందుకు ఎప్పుడైనా వెళ్లవచ్చు.

అంతేకాదు రక్తపోటు ఉందని నిర్ధారణ అయితే కుటుంబ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా నెలలో రెండుసార్లు వారి గ్రామానికే వస్తున్న వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు వాడుతున్నారు. దీంతో గ్రామీణులు  రక్తపోటును అదుపులో ఉంచుకునే అవకాశం లభించింది. పట్టణ వాసులు సమీపంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎప్పుడైనా వెళ్లి పరీక్ష చేయించుకుని మందులు వాడుకోవచ్చు.  

రక్తపోటుకు కారణాలివే.. 
జీవన శైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండే జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం.  
 శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం రక్తపోటు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.  
ఇటీవల 30 ఏళ్ల వయసు వారు కూడా తీవ్రమైన రక్తపోటుతో బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు.  

అదుపులో ఉండాలంటే... 
 రక్తపోటు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు వ్యాయామం, వాకింగ్‌ లాంటివి తప్పక చేయాలి.  
 ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది.  
 ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.  
 ప్రతి మనిషి నెలలో 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం 
 ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. 

సద్వినియోగం చేసుకోండి 
ఇప్పుడు వైద్యం గ్రామాలకే వెళ్లి అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ డాక్టర్‌ కార్యక్రమంలో రక్తపోటును పరీక్షించి మందులు అందచేస్తున్నాం. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఉంటే ఎంఎల్‌హెచ్‌పీల వద్ద బీపీ పరీక్షించుకోవచ్చు.రక్తపోటును అదుపులో ఉంచుకోకుంటే ఇతర అవయవాలపై ప్రభా­వం చూపుతుంది. రక్తపోటుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నాం. – డాక్టర్‌ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌వో, ఎన్టీఆర్‌ జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top