అందరూ ఉన్నా.. అనాథ

Human Story On Orphan Man - Sakshi

మంట కలిసిన మానవత్వం

దాతృత్వం చూపుతున్న స్థానికులు 

ఆత్మకూరు: ఆయన.. అందరూ ఉన్న అనాథ. బాగా బతికిన రోజుల్లో దగ్గరగా ఉన్న తోబుట్టువులు.. చితికిపోయిన సమయంలో దూరమయ్యారు. ఊర్లోనే రక్త సంబంధీకులు ఉన్నా.. ఆ వృద్ధుడి పరిస్థితి చూస్తే మమకారాలు, మానవత్వం మంట కలిశాయని చెప్పక తప్పదు. వారం రోజులుగా మున్సిపల్‌ బస్టాండ్‌లో ఓ వృద్ధుడు ఆకలి దప్పులతో అలమటిస్తూ పడి ఉన్నాడు. వివరాల్లోకెళితే.. పట్టణంలోని జేఆర్‌పేటకు చెందిన పసుపులేటి మోహన్‌ ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తే. ఇళ్లలో ప్రైవేట్‌గా కరెంట్‌ పనులు చేసుకుంటూ బతికిన వ్యక్తి. ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురైంది. ఆమె వైద్యం కోసం ఖర్చు చేసి ఉన్న ఇల్లును అమ్మేసుకున్నాడు. గతేడాది అనారోగ్యానికి గురైన భార్య మృతి చెందడంతో ఇతను అనారోగ్యం పాలయ్యాడు.

సొంత అన్నదమ్ములు ఉన్నా పట్టించుకునేవారు లేరు. భార్య చనిపోవడంతో, ఇల్లు అమ్ముకోవడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఇతనిని ఎవరూ ఆదరించలేదు. సరైన తిండి లేక శల్యమయ్యాడు. వారం రోజులుగా ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్‌ భవనమే షెల్టర్‌గా ఉంటున్నాడు. ఎవరైనా దాతలు చూసి తిండి పెడితే తింటున్నాడు. ఐదు రోజులుగా పట్టణంలో లాక్‌డౌన్‌ విధించడంతో జనజీవనం స్తంభించింది. దీంతో ఇతనిని గమనించి ఆహారం అందించే వాళ్లు లేరు. బుధవారం పట్టణానికి చెందిన వలంటీర్‌ హరీష్‌ బుధవారం ఆ దారిన వెళుతూ అతని పరిస్థితి చూసి ఆహారం అందించాడు. అది సైతం తినే శక్తి లేక నానా ఇబ్బందులు పడుతూ కొంత ఆహారం తిన్నట్లు హరీష్‌ తెలిపాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమేష్‌బాబులు ఆ వృద్ధుడికి మున్సిపల్‌ బస్టాండ్‌ ఆవరణలోనే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. పట్టించుకునే వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top