గర్భిణులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు | Sakshi
Sakshi News home page

గర్భిణులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు

Published Tue, Oct 26 2021 3:09 AM

Huge cash incentives for pregnant women Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకున్న గర్భిణికి శిశు సంరక్షణ కిట్‌ పేరిట 2016 నుంచి 2019 వరకూ రూ.695 విలువ చేసే కిట్‌ ఇచ్చేవారని, ఇప్పుడు గర్భిణికి ప్రసవం అనంతరం ఆసరా కింద భారీగా నగదు ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రసవం అయితే రూ.5 వేలు, సిజేరియన్‌ అయితే రూ.3 వేలను 24 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు.

ఆ మొత్తం నుంచే శిశువుల సంరక్షణకు కావాల్సినవి గర్భిణులే కొనుక్కుంటున్నారన్నారు. ‘శిశు సంరక్షణ కిట్లకు కటకట’ శీర్షికన కిట్ల పంపిణీని నిలిపివేసినట్టు ఓ పత్రిక రాసిందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కేవలం శిశు సంరక్షణ కిట్‌ మాత్రమే ఇచ్చి.. ఎలాంటి నగదు ఇచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు గర్భిణికి రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. ప్రసవం కాగానే ప్రతి ఒక్కరికీ నగదు జమ అవుతోందన్నారు. 

46.79 శాతం మందికి రెండు డోసులూ పూర్తి
రాష్ట్రంలో ఇప్పటివరకూ 46.79 శాతం మందికి కోవిడ్‌ టీకా రెండు డోసులూ పూర్తయినట్టు సింఘాల్‌ చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన 3.47 కోట్ల మంది టీకాకు అర్హులని గతంలో తాము అంచనా వేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్లుగా సమాచారం పంపించిందన్నారు. దీన్ని బట్టి ఇప్పటివరకూ 46.79% మందికి రెండు డోసులు టీకా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో 1,84,90,379 మందికి రెండు డోసులు వేశామన్నారు. 1,32,65,148 మందికి తొలి డోసు పూర్తయిందని చెప్పారు. వ్యాక్సినేషన్‌ విషయంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం చాలా ముందుందని తెలిపారు.

కరోనా కేసులు తగ్గినా 104 కాల్‌సెంటర్‌ను కొనసాగిస్తున్నామని, ఎవరు ఫోన్‌ చేసినా సమాచారం వస్తుందన్నారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు మొదలుకొని కొత్త మెడికల్‌ కాలేజీల వరకూ నిర్మాణం జరుగుతున్నాయని, ప్రణాళికాబద్ధంగా నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంచామని, గత 6 నెలల్లోనే రూ.1,013 కోట్లను ఆరోగ్యశ్రీ కింద వ్యయం చేశామన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement