రెండో రోజునా.. ‘పట్టా’భిషేకం

House site pattas distribution Second Day In Andhra Pradesh - Sakshi

రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ

ఆనందంతో భావోద్వేగానికి గురైన మహిళలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ కన్నీళ్లు తుడిచారంటూ కృతజ్ఞతలు

సాక్షి నెట్‌వర్క్‌: ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిర్మించుకుందాం’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెండో రోజైన శనివారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది.

పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కటంతో ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. జానెడు జాగా కోసం ఎన్నో ఏళ్లుగా పడిగాపులు పడుతున్న తమకు సీఎం జగన్‌ ఇళ్ల పట్టాలు అందించి తమ కన్నీళ్లు తుడిచారంటూ కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రెండో రోజూ అదే ఉత్సాహం
శ్రీకాకుళం జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శనివారం 5,095 మంది మహిళలకు పట్టాలు అందజేశారు. ఆమదాలవలస నియోజకవర్గం పురుషోత్తంపురంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మందస మండలంలో మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, కొమరాడలో పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ గరివిడిలో, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి బలిజిపేటలో పట్టాలు అందజేశారు.

విశాఖ జిల్లాలో 4,274 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, 133 మందికి టిడ్కో ఇళ్లు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 22 మండలాల పరిధిలోని 90 గ్రామాల్లో 13,522 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్‌రామ్, చింతా అనురాధ, పార్టీ విప్‌ దాడిశెట్టి రాజా, ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, ఏపీ పీయూసీ చైర్మన్‌ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 10,874 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో 9,503 మందికి పట్టాలు అందజేశారు.

మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 10,300 మందికి ఎమ్మెల్యేలు, అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. ప్రత్తిపాడులో పట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్లిన హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితను లబ్ధిదారులు గుర్రపు బగ్గీపై ఎక్కించి భారీ ఊరేగింపుగా ప్లాట్లు పంపిణీ చేసే స్థలం వరకు తీసుకువెళ్లారు. కర్నూలు జిల్లాలో 7,298 మంది మహిళలకు పట్టాలను అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసన మండలి విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 7,471 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో 5,727 పట్టాలను పంపిణీ చేసినట్టు కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు రెడ్డెప్ప, మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంఎస్‌ బాబు, నవాజ్‌ బాషా పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,646 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లాలో శనివారం 18,380 మందికి పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానమ్, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, కలెక్టర్‌ హరికిరణ్‌ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో రోజైన శనివారం 990 మందికి పట్టాలు పంపిణీ చేశారు.

పదేళ్ల సర్వీసులో ఇలాంటి అభివృద్ధి చూడలేదు
నేను సర్వీసులో చేరి పది సంవత్సరాలు కావస్తోంది. ఇలాంటి అభివృద్ధిని చూడలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ విధంగా పేదలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి లభిస్తోంది.
    
నారాయణ భరత్‌గుప్త, కలెక్టర్, చిత్తూరు


తూ.గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాలు అందుకునేందుకు భారీ సంఖ్యలో వచ్చిన మహిళలు


చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాంపల్లెలో ఇళ్ల పట్టాల పంపిణీ సభకు హాజరైన లబ్ధిదారులు
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top