
కొనకనమిట్ల, మంగ నెల్లూరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత
శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 5.3 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల ఎండలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనిపించింది. వడగాలులు కూడా ఎక్కువగా ఉండడంతో జనం బయట తిరిగేందుకు జంకుతున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
పల్నాడు జిల్లా కాకానిలో 42.7 డిగ్రీలు, బాపట్ల జిల్లా కొమ్మలపాడులో 42 డిగ్రీలు, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.7, నంద్యాల జిల్లా బొల్లవరంలో 41.6 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 ప్రాంతాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా జగ్గిలి»ొంతులో 5.3. సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అదే జిల్లాలోని రాగోలులో 4.9 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.7, ఏలూరు జిల్లా పూళ్లలో 4.4, శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేటలో 3.8, ఆముదాలవలసలో 3.5, ఏలూరులో 3.4, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో ఇదేతరహా అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.