గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి

Home Minister Taneti Vanita Visits YSRCP Leader Ganji Prasad House - Sakshi

సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌ కుటుంబ సభ్యులను హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పార్టీ కోసం గంజి ప్రసాద్‌ ఎంతో సేవ చేశారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఆ ముగ్గురు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. కుటుంబ సభ్యులు చెప్తున్న బజారీ అనే వ్యక్తిపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ హత్యకు కారకులు, ప్రేరేపించినవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుదని హోం మంత్రి భరోసా ఇచ్చారు. 

మాజీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. హత్యకు సంబంధించిన వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాము. ఏ పార్టీ అయినా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అసలైన నిందితులకు శిక్ష పడేలా చూస్తాము. గ్రామంలోని నాయకులు సంయమనం పాటించాలి. వారి కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత' అని మాజీ మంత్రి ఆళ్ల నాని అన్నారు. 

చదవండి👉 (వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య)

ఇదిలా ఉంటే శనివారం ఉదయం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌ (55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ముగ్గురు యువకులు కత్తులతో దాడిచేసి ఆయనను హత్యచేశారు. అనంతరం వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల ముసుగులో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎమ్మెల్యేను పక్కనే ఉన్న పాఠశాలలో నిర్బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పోలీస్‌ యంత్రాంగం రంగప్రవేశం చేసి, నాలుగు గంటల అనంతరం ఎమ్మెల్యేను ఇంటికి పంపించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top