
పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
తురకా కిషోర్ రిమాండ్ ఉత్తర్వుల్లో స్పష్టత లేదు
మేజిస్ట్రేట్ ఏం చెప్పదలచుకున్నారో అర్థం కావడం లేదు
నేరాంగీకార వాంగ్మూలంపై సంతకం చేయక పోవడం తప్పా?
ఈ కేసుకు సంబంధించిన రికార్డులను పూర్తిగా మేమే పరిశీలిస్తాం
కేసు డైరీ సహా మొత్తం రికార్డులను మా ముందుంచండి
రెంటచింతల పోలీసులకు ధర్మాసనం ఆదేశం
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం జరిగిన ఘటనలో అయిన గాయానికి ఇప్పుడు ఊండ్ సర్టిఫికెట్ (ఎంఎల్‌సీ–మెడికో లీగ్ కేసు) తీసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ నేత తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన కేసు డైరీతో సహా పూర్తి రికార్డులను తమ ముందుంచాలని మంగళవారం పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌కు గల కారణాలను, అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులను తనకు అందజేయలేదని మేజిస్ట్రేట్ కు తురకా కిషోర్ చెప్పారని, అయితే మేజిస్ట్రేట్ ఈ విషయంలో సంతృప్తి చెందినట్లు గానీ, చెందనట్లు గానీ ఎక్కడా రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ధర్మాసనం తెలిపింది.
ఈ నేపథ్యంలో తాము పూర్తి రికార్డులను చూడాలన్న నిర్ణయానికి వచ్చామంది. గుంటూరు జిల్లా జైలు నుంచి ఇటీవల విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గత బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం అసలు తురకా కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి.. వాటిని ఎప్పుడు నమోదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్ చేశారు.. ఏ ఘటనలో అరెస్ట్ చేశారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు కిషోర్‌పై నమోదు చేసిన కేసుల వివరాలను ధర్మాసనం ముందుంచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.
కోర్టును తప్పుదోవ పట్టించిన ఎస్‌ఐ
తురకా సురేఖ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. రెంటచింతల సబ్ ఇన్‌స్పెక్టర్ కోర్టును సైతం తప్పుదోవ పట్టించారన్నారు. అరెస్ట్‌కు గల కారణాలను, అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులను నిబంధనల ప్రకారం నిర్బంధంలో ఉన్న వ్యక్తికి చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అయితే పోలీసులు అలాంటి సమాచారం ఏదీ కిషోర్‌కు చెప్పక పోయినా, చెప్పినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ కింది కోర్టును తప్పుదోవ పట్టించారని వివరించారు. ఈ సమయంలో రామలక్ష్మణరెడ్డి సమర్పించిన పలు డాక్యుమెంట్లను ధర్మాసనం పరిశీలించింది.
ఏడాది క్రితం జరిగిన ఘటనలో ఏర్పడిన గాయానికి ఇప్పుడు ఊండ్ సర్టిఫికెట్ ఎలా తీసుకుంటారంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రామలక్ష్మణరెడ్డి తన వాదనను కొనసాగిస్తూ, పోలీసులు తమకు ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం కిషోర్‌కు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించింది. అందులో ఎక్కడా తురకా కిషోర్‌కు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పోలీసులు ఇచ్చినట్లు పేర్కొనలేదని తెలిపింది. రిమాండ్ ఉత్తర్వుల్లో మేజిస్ట్రేట్ ఏం చెప్పదలచుకున్నారో తమకు అర్థం కావడం లేదంది.
పోలీసులు తయారు చేసిన నేరాంగీకార వాంగ్మూలంపై తురకా కిషోర్ సంతకం చేయడానికి నిరాకరించడం తప్పు అన్నట్లు మేజి్రస్టేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సంతకం చేయడానికి నిరాకరించడం తప్పా? అని ప్రశ్నించింది. మేజిస్ట్రేట్ జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులు చాలా అస్పష్టంగా ఉన్నాయని, అందువల్ల తాము ఈ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తామని తెలిపింది. తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసు రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.