ఉపాధ్యాయుల బదిలీలతో మీకేం సంబంధం? | High Court Fires On BC Welfare Over Teachers Transfer | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమ సంఘంపై హైకోర్టు ఫైర్‌

Dec 12 2020 10:14 AM | Updated on Dec 12 2020 12:25 PM

High Court Fires On BC Welfare Over Teachers Transfer - Sakshi

సాక్షి, అమరావతి : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన ఏపీ బీసీ సంక్షేమ సంఘంపై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేసి బదిలీల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బి.చిరంజీవి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.నాగేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది నవంబర్‌ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఉపాధ్యాయుల బదిలీలతో పిటిషనర్‌కు ఏంపని అని ప్రశ్నించింది. బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని, అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టుకొచ్చి పోరాడే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్‌ దాఖలు చేయడం పరిధి దాటి వ్యవహరించడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీసీ సంక్షేమ సంఘం పేరుతో ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. దీంతో పిటిషనర్‌  న్యాయవాది పిల్‌ను ఉపసంహరించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement