విస్తారంగా వర్షాలు

Heavy Rains In Andhra Pradesh for next two days - Sakshi

విశాఖ ఏజెన్సీలో కుండపోత 

పశ్చిమ గోదావరిలో నీట మునిగిన ఎద్దెల వాగు వంతెన

జలదిగ్బంధంలో 29 గ్రామాలు

పెదవాగు ఉగ్రరూపం 

మరో 2 రోజులపాటు వానలు

సాక్షి, నెట్‌వర్క్‌: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమాండ ప్రధాన రహదారిలో వంతెనపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 67.9 మిల్లీమీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సింహభాగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకినాడ అర్బన్‌లో 174 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాజోలులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది.

ఏజెన్సీలో కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్‌ (చిట్టి) చేపలు పట్టేందుకు స్థానిక పంపుహౌస్‌ సమీపంలోని కాలువలో దిగగా ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట ఉన్న కపుల్‌ బెడ్స్, వాచ్‌ టవర్స్, గొడుగులు వంటి వాటిని కెరటాలు తాకడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. భీమిలి బీచ్‌ రోడ్డు, మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోనూ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా కవిటిలో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పశ్చిమగోదావరి జిల్లా ఎద్దెలవాగు వంతెనపై ప్రవహిస్తున్న గోదావరి వరద 

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలో ఎద్దెల వాగు వంతెన సోమవారం రాత్రి నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యల పాకలుతోపాటు మరో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి పెదవాగు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం, ఊటగుంపు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అశ్వారావుపేట వెళ్లే రహదారిలో రామవరం వద్ద లోతు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోటకు వెళ్లే దారిలో పెదవాగు వంతెన ప్రాంతంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మద్దిగట్ల ప్రాంతంలో వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న 2,000 గొర్రెలను ఎస్‌ఐ సాదిక్, సిబ్బంది కాపాడారు. తహసీల్దార్‌ చల్లన్నదొర ఎద్దెల వాగు వద్ద నాటు పడవను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 0.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 

వాగులో గల్లంతైన యువతి మృతి 
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగొస్తూ సోమవారం వాగులో గల్లంతైన మనీషా వర్మ (23) మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు ఐదు బృందాలు ఉదయం నుంచి వాగు వెంట ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కంట్లం సమీపంలో వాగులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 

వారంలో మరో అల్పపీడనం..
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం తెలిపాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రానున్న వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడి.. ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో 10 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకుంటాయి. కాగా, గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 46.5, విశాఖపట్నంలో 30, పెందుర్తి, చింతపల్లిల్లో 22, అనకాపల్లిలో 18, వాయల్పాడులో 16.3, మాకవరపాలెంలో 12, కమలాపురంలో 11, సంజామలలో 10, నర్సీపట్నంలో 9, అమరపురంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top