రాష్ట్రం వెలుపలా ఆరోగ్యశ్రీ ఆదుకుంది

Heart transplant treatment successful in Bangalore with Aarogyasri - Sakshi

బెంగళూరులో గుండె మార్పిడి చికిత్స విజయవంతం

ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం కింద ఇదే తొలి ఆపరేషన్‌

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో మల్లికార్జున వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో మొదటిసారి చేసిన గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈఓ మల్లికార్జున తెలిపారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామానికి చెందిన ఎ.ఆనంద్‌ (26)కు బెంగళూరులో గత నెల 28న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించగా అది విజయవంతమై అతను కోలుకున్నట్టు తెలిపారు. 

► నాలుగేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్న ఆనంద్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి నిర్ధారించింది.
► దీంతో బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించారు. 
► ఇందుకు ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ బెంగళూరు సమన్వయకర్త డాక్టర్‌ ఉష నిరంతరం పర్యవేక్షించారు.
► గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్యాకేజీ రూ.11 లక్షల మొత్తాన్ని వైదేహి ఆస్పత్రికి అందిస్తాం. ఆనంద్‌కు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఈ శస్త్రచికిత్స అందించాం.
► ఆపరేషన్‌ జరిగిన ఐదో రోజున ఆనంద్‌ కోలుకొని తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
► సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందించడాన్ని 2019 నవంబర్‌ ఒకటి నుంచి ప్రారంభించాం. అందులో భాగంగానే తొలిసారి ఆనంద్‌కు బెంగళూరులో చికిత్స చేయించగా, అది విజయవంతమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top