ఏలూరులో ఘరానా మోసగాడు | Harish Kumar Cheating People | Sakshi
Sakshi News home page

ఏలూరులో ఘరానా మోసగాడు

May 22 2025 10:59 AM | Updated on May 22 2025 10:59 AM

Harish Kumar Cheating People

హైదరాబాద్‌, బెంగుళూరులో మోసాలు

కోట్లలో డబ్బులు కాజేసిన వైనం

ఏలూరు టౌన్‌: ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా బెంగుళూరు, హైదరాబాద్‌ నగరాలతో సహా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక మందిని మోసం చేసి భారీగా డబ్బులు కాజేశాడు. బంగారం బిస్కెట్లు, ఆన్‌లైన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌, విదేశాల్లో ఉద్యోగాలు, తన కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి కోట్ల నగదు కాజేశాడు. ఈ మోసగాడికి పోలీసులు ఎట్టకేలకు చెక్‌ పెట్టారు. 

పోలీసులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగర శివారు వట్లూరు ఇంద్రప్రస్థా కాలనీకి చెందిన సత్తెనపల్లి హరీష్‌ కుమార్‌ అలియాస్‌ రిషి, అలియాస్‌ రిషికుమార్‌ చాలా కాలంగా హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌, మై హోమ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటూ చార్టర్డ్‌ అకౌంటెంట్‌, సొంతగా ఆన్‌లైన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఉందని చెబుతూ ఆన్‌లైన్‌లో పలువురితో చాటింగ్‌ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. 

ట్రేడ్‌ బిజినెస్‌ లోనూ అపారమైన అనుభవం ఉందని పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఏలూరు శనివారపుపేటకు చెందిన ఓ వ్యాపారి పీ. సాయికుమార్‌ ఇతనికి పరిచయం కాగా విదేశాల్లో ఉద్యోగాలు, గోల్డ్‌ బిస్కెట్ల వ్యాపారం ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన సాయికుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1 కోటి నగదు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేయటంతో సైబరాబాద్‌ కమిషనరేట్‌ సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం హరీష్‌ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తీగ లాగితే డొంక కదిలింది
తీగ లాగితే డొండ కదిలినట్లు హరీష్‌ చేసిన అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో హరీష్‌ కుమార్‌ నల్లజర్లకు చెందిన ఒక ఆక్వా వ్యాపారిని ఆన్‌లైన్లో పరిచయం చేసుకుని గోల్డ్‌ బిస్కెట్లు, ట్రేడ్‌ మార్కెట్లో లాభాలు ఇస్తానని నమ్మించి అతని వద్ద విడతల వారీగా రూ. 50 లక్షలు కాజేశాడు. బాధితుడు ఒత్తిడి చేయటంతో ఏలూరు ఇంద్రప్రస్థా కాలనీలో ఉన్న తన ఇల్లు బాధితుడికి అమ్మి రిజిస్ట్రేషన్‌ కూడా చేశాడు. కానీ ఇల్లు అప్పచెప్పకుండా తన భార్య, తల్లి, మరదలను ఆ ఇంట్లోనే ఉంచుతూ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెట్టాడు.

 ఇక ఏలూరు శనివారపుపేటకు చెందిన మరో వ్యాపారి వద్ద రూ.2.50 కోట్లు కాజేశాడు. బెంగుళూరులో శశాంక్‌ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మబలికి రూ.62 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగుళూరు సైబర్‌ క్రైం పోలీసులు ఇటీవలే హరీష్‌ కుమార్‌ని అరెస్ట్‌ చేసి అక్కడ సెంట్రల్‌ జైల్లో ఉంచారు.

అనంతరం హైదరాబాద్‌లో ఈ మోసగాడి చేతిలో రూ.1 కోటి 85 లక్షలకు మోసపోయిన రెనిల్‌ కుమార్‌ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బషీరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అతన్ని ఈనెల 4న పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేసి చంచల్‌గూడా జైలుకు తరలించారు. హరీష్‌ కుమార్‌పై తాజాగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేయటంతో అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఏలూరులోనే మరికొంతమంది బాధితులు మేమూ మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement