బిస్కెట్లుగా దేవుడి నగలు 

Devadaya Ministry Plans Depositing Gold Biscuits In Bank Generate Income - Sakshi

ఉత్సవమూర్తులకు అలంకరించేవి కొన్నే.. మిగతావి నిరుపయోగం 

తాజాగా ఆభరణాలను బిస్కెట్లుగా మార్చేందుకు కసరత్తు 

వెండిని కరిగించి దాని విలువ మేరకు బంగారం బిస్కెట్లుగా మార్పిడి 

స్టేట్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ ద్వారా ఆదాయం పొందే యోచన  

వడ్డీ రూపంలో ఏటా 2.5 కోట్లు!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ముఖ్య దేవాలయాల్లో మూలుగుతున్న బంగారు, వెండి ఆభరణాలు, వస్తువుల మూటలకు మోక్షం కలగనుంది. బంగారం బిస్కెట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం ద్వారా లాకర్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకునే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలోనే ప్రధాన దేవాలయం వేములవాడ.. భక్తుల కొంగుబంగారం. అందుకు తగ్గట్టుగానే అక్కడికి వచ్చే భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఇందులో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కూడా ఉంటాయి. అయితే స్వామికి అలంకరించే ఆభరణాలు పోను మిగతావి పదుల సంఖ్యలో మూటల్లో నింపి లాకర్లలో పడేశారు.

రాష్ట్రంలోని భద్రాచలం, బాసర, కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమురవెల్లి, ధర్మపురి, వరంగల్‌ భద్రకాళి, ఉజ్జయినీ మహంకాళి.. ఇలా ముఖ్య దేవాలయాలన్నిటిలో ఇదే పరిస్థితి. భద్రాచలం దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఎక్కువ నగలను దేవతా మూర్తులకు అలంకరిస్తున్నారు. యాదగిరిగుట్టలో దేవాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బంగారాన్ని కరిగించి ఆలయానికే వినియోగిస్తున్నారు. కానీ మిగతా దేవాలయాల్లో ఆభరణాలు, వస్తువులు, తుసుర్ల రూపంలో ఉన్న వెండి, బంగారం ఎన్నో ఏళ్లుగా లాకర్లలో మూలుగుతున్నాయి. అయితే ఇప్పుడవి బంగారం బిస్కెట్లలా మారనున్నాయి. తర్వాత అవి స్టేట్‌ బ్యాంకు అధీనంలోకి వెళ్లడం ద్వారా వడ్డీ రూపంలో దేవాదాయ శాఖకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరనుంది.  

గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం కింద.. 
బంగారాన్ని డిపాజిట్‌ చేసే పని ఇప్పటికే మొదలు కాగా, తాజాగా వేల కిలోల వెండి.. దాని విలువకు తగ్గ బంగారం బిస్కెట్లుగా మారనుంది. వెండిని కరిగించి దానికి బదులుగా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఇచ్చేందుకు మింట్‌ అంగీకరించింది. మొత్తం బంగారాన్ని గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకంలో డిపాజిట్‌ చేయటం ద్వారా సాలీనా రూ.2.5 కోట్ల వడ్డీ దేవాదాయ శాఖకు అందుతుందని సమాచారం. ఇంతకాలం ఆ వెండి, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరిచినందుకు లాకర్‌ అద్దె, కొన్నింటికి బీమా చేయించినందుకు ప్రీమియం రూపంలో లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖర్చు మిగలనుంది.   

వేములవాడ ఆలయంతో మొదలు.. 
దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో వినియోగంలో లేని బంగారం దాదాపు 425 కిలోలు ఉంది. అలాగే 18 వేల కిలోల వెండి లాకర్లలో మూలుగుతోంది. నిజానికి ఆలయాల్లో 38 వేల కిలోల వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. కానీ అందులో సగానికంటే కాస్త ఎక్కువ మాత్రమే వినియోగంలో ఉండగా మిగతావి లాకర్లలోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ఆదాయాన్ని పెంచుకునే కసరత్తులో భాగంగా బంగారం, వెండి వస్తువులను స్టేట్‌ బ్యాంకు గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీంలో భాగంగా డిపాజిట్‌ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఆ మేరకు వినియోగంలో లేని బంగారాన్ని మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ) ఆధ్వర్యంలో కరిగించి బిస్కెట్లుగా మార్చే కసరత్తు ప్రారంభమయ్యింది. ఇటీవలే కొంత బంగారాన్ని స్టేట్‌ బ్యాంకుకు అప్పగించారు. దాదాపు 70 కిలోల బంగారాన్ని డిపాజిట్‌ చేయనున్నారు.  

మింట్‌ అధికారులతో చర్చ 
తాజా సమాచారం ప్రకారం.. బంగారాన్ని నేరుగా స్టేట్‌బ్యాంకే ఎంఎంటీసీలో కరిగిస్తుంది. అక్కడ 95 శాతం ప్యూరిటీ స్థాయికి తెప్పించి దాన్ని బిస్కట్లుగా మారుస్తారు. వెండి విషయంలో మాత్రం ఇటీవల మింట్‌ యంత్రాంగంతో దేవాదాయ శాఖ అధికారులు చర్చించారు. వెండిని కరిగించి పూర్తి స్వచ్ఛమైన వెండిలా మార్చి.. అప్పటి బులియన్‌ ధరల ప్రకారం దాని విలువను బంగారంతో లెక్కగట్టి.. అంత విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కట్ల రూపంలో దేవాదాయ శాఖకు అందించేందుకు మింట్‌ అంగీకరించినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న 18 వేల కిలోల వెండిని మింట్‌కు అప్పగించనున్నారు. తొలుత వేములవాడ దేవాలయం వెండిని బిస్కెట్లుగా మార్చే పనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయంలోని 800 కిలోల వెండికి బదులుగా మింట్‌ నుంచి దాదాపు 8 కిలోల బంగారు బిస్కెట్లు సమకూరుతాయని అంచనా. అలా అన్ని దేవాలయాల్లోని వెండి ద్వారా దాదాపు 180 కిలోల వరకు బంగారం సమకూరుతుందని భావిస్తున్నారు. అంటే వంద కిలోల వెండికి కిలో బంగారం వస్తుందన్నమాట.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top