నేతన్నల దరిచేరని ఉచిత విద్యుత్ పథకం
హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు
500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కొరవడిన చిత్తశుద్ధి
22 నెలలపాటు ఉచిత విద్యుత్ కోల్పోయిన నేతన్నలు
1,03,534 కుటుంబాలకు వర్తింపచేస్తామంటూ ఆర్భాటం
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ.. 57,247 మందికే పరిమితం
రాష్ట్రంలో సగం మందికిపైగా అందని సర్కారు పథకం
అద్దె ఇళ్లలో ఉండే నేతన్నలకు షాక్
చేనేత.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం తరువాత అత్యధికులకు ఉపాధినిచ్చే రంగం. వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం ఇలా ఊరేదైనా ప్రతిచోటా మగ్గాలపై నేసే చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అలాంటి చేనేత రంగాన్ని సీఎం చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారు. మహర్దశ తెస్తానంటూ చివరకు మగ్గాన్నే విరిచేస్తున్నారు.
హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని 22 నెలలపాటు అమలు చేయలేదు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినా సగం మగ్గాలకు కూడా అమలు చేయడం లేదు. కనీసం ఉచిత విద్యుత్ కూడా దక్కకపోవడంతో చేనేత కుటుంబాలు చంద్రబాబు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశల రంగులు క్రమంగా వెలిసిపోతున్నాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత రంగానికి ఇలాంటి వారెందరో ఉచిత విద్యుత్ అందకపోవడంతో మగ్గాలు చీకట్లోనే మగ్గిపోతున్నాయి. తమను గెలిపిస్తే హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక 9 నెలలకు గానీ ఉచిత విద్యుత్‌కు సంబంధించిన జీఓ ఇవ్వలేదు. ఆ తరువాత జీఓ ఇచ్చినా 13 నెలలపాటు అమలు చేయలేదు.
ఫలితంగా 22 నెలలపాటు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అక్కరకు రాలేదు. తీరా అమలులోకి వచ్చేసరికి లబ్దిదారుల సంఖ్యను గమనిస్తే.. పథకం అమలులో కొరవడిన చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మే నెల(ఏప్రిల్ బిల్లు)లో ఉచిత విద్యుత్ లబ్ధి కేవలం 57,247 మందికేనని ప్రభుత్వం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న సంఖ్య ఇంకా తక్కువే ఉంటుందని చేనేత సంఘాల నేతలు చెబుతున్నారు.
క‘రెంట్’ షాక్
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం దక్కకపోవడానికి వారు అద్దె ఇళ్లలో ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు. చాలామంది నేత కార్మికులకు సొంత ఇళ్లు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఇంటి యజమాని సంతకం చేసిన నోటరీ అఫిడవిట్, ఆధార్‌కార్డు, కరెంటు బిల్లు సమరి్పంచాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. లబ్ధిదారులు అద్దె ఇళ్లలో ఉంటున్నట్టు నోటరీ అఫిడవిట్ ఇచ్చేందుకు యజమానులు అంగీకరించడం లేదు.
అఫిడవిట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు
మంగళగిరిలో అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఏప్రిల్ నెలలో రూ.1,399 బిల్లు వచ్చిందని, మే నెల రూ.2,058 వచ్చిందని శ్రామిక నగర్‌కు చెందిన నేతన్న దంపతులు వాపోయారు. తమ ఇంటి యజమాని నుంచి నోటరీ అఫిడవిట్ తీసుకుని అధికారులకు సమర్పించినా ఉచిత విద్యుత్ పథకంలో తమ పేరు వచ్చిందో లేదో కూడా చెప్పడం లేదని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంటున్న ఓ నేతన్న కుటుంబాన్ని ఉచిత విద్యుత్ ఎందుకు రాలేదని ఆరా తీయగా.. ‘ఏమో అన్నా. నాకు తెలియదు. వచ్చే జాబితాలో వస్తుందంటున్నారు. దయచేసి నా పేరు పేపర్‌లో రాయొద్దు. దీనికోసం టీడీపీ నాయకుడికి రూ.3 వేలు ఇచ్చాను. ఈసారి కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా’ అని చెప్పడం గమనార్హం.
మంగళగిరికి ప్రత్యేకం.. రాష్ట్రానికి మంగళం
చేనేత సంఘాల ప్రతినిధులు చెబుతున్న లెక్కల ప్రకారం మంగళగిరిలో మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలు వెయ్యిలోపే ఉంటాయి. అయితే.. ఇక్కడ 2,463 మందికి ఉచిత విద్యుత్ పథకం వర్తింపచేశారు. టీడీపీ నేతలు ఎవరికి ఇవ్వమంటే వారికి అధికారులు ఇచ్చేశారు. అయితే.. పాత మంగళగిరి ప్రాంతానికి చెందిన 28 మంది అర్హులకు ఇంకా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో చీరాల, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో వివిధ రకాల సాకులు చూపి అర్హులకు మంగళం పాడేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
22 నెలలకు రూ.189 కోట్లు నష్టపోయిన నేతన్నలు
ఉచిత విద్యుత్ పథకాన్ని 22 నెలల జాప్యం చేయడంతో రాష్ట్రంలోని నేతన్నలు మొత్తం రూ.189 కోట్లు నష్టపోయినట్టు అంచనా. రాష్ట్రంలో 93 వేల చేనేత మగ్గాలు, 10,534 మరమగ్గాలు కలిగిన మొత్తం 1,03,534 మందికి ఉచిత విద్యుత్ వర్తింపచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి ఉంటే రాష్ట్రంలో 1,03,534 కుటుంబాలకు 22 నెలల కాలంలో రూ.189,02,66,400 లబ్ధి చేకూరేది.
చేనేత మగ్గాలు కలిగిన ఒక్కొక్క నేతన్న నెలకు రూ.720 (నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్) చొప్పున 22 నెలలకు రూ.15,840 చొప్పున నష్టపోయారు. ఈ లెక్కన మొత్తం 93 వేల కుటుంబాలకు రూ.147,31,20,000 మొత్తాన్ని కోల్పోయారు. మర మగ్గాలు కలిగిన నేతన్న నెలకు రూ.1,800 (నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్) చొప్పున 22 నెలలకు రూ.39,600 లబ్ధి దక్కకుండా పోయింది. మర మగ్గాలు కలిగిన మొత్తం 10,534 మంది రూ.41,71,46,400 నష్టపోయారు.
మంత్రి నోట.. పూటకో మాట
ఉచిత విద్యుత్ అమలు పథకంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పూటకో మాట చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 29న సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రకటించారు. అందులో 93,000 చేనేత కుటుంబాలు, 10,534 మరమగ్గాల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అర్హులైన ప్రతి నేతన్నకు ఈ పథకం అందుతుందని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.85 కోట్ల భారాన్ని భరిస్తోందని పేర్కొన్నారు. మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. మే 2న మంత్రి మాట్లాడుతూ.. జీరో బిల్లుతో నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 50,252 చేనేత కుటుంబాలు, 6,995 మరమగ్గాల కుటుంబాలను (మొత్తం 57,247) గుర్తించినట్టు చెప్పారు.
నేతన్న నేస్తం ‘జగన్’
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చేనేతల కోసం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గత టీడీపీ ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.3,706 కోట్లకుపైగా వెచ్చించింది. కేవలం ఒక్క వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా నగదు జమ చేశారు.
నేతన్న నేస్తం పథకం ద్వారా మొత్తం రూ.982.98 కోట్ల ఆర్థిక సాయం అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. వైఎస్ జగన్ అందించిన చేయూతతో చేనేత కుటుంబాల్లో సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. చేనేత కుటుంబాల్లో 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే.. జగన్ అందించిన ప్రోత్సాహంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకుపైగా ఆదాయం ఆర్జిస్తూ నేతన్నలు నిలదొక్కుకున్నారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు ప్రత్యేకంగా కోవిడ్ సాయం అందించి జగన్ ఆదుకున్నారు.


నేతన్నలను దగా చేసిన చంద్రబాబు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేతన్నలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించిన నేతన్న నేస్తాన్ని కొనసాగిస్తామని, ఏడాదికి రూ.25 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. 22 నెలలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. 57 వేల మందికే ఉచిత విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం. ఎటువంటి ఆంక్షలు లేకుండా రాష్ట్రంలో ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్ అందించాలి. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమిస్తాం. – బీరక సురేంద్ర, మాజీ చైర్మన్, దేవాంగ కార్పొరేషన్
చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత సమస్యలపై మంత్రి లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమరి్పస్తే తీసుకున్నారు. 6 నెలల తరువాత చేనేత కార్మికులకు రూ.2వేల కోట్లు కావాలా అంటూ వెటకారం చేశారు. మంత్రి సవితను కలిసి వినతిపత్రం ఇస్తే.. నేతన్న నేస్తం ఇచ్చి జగన్ చేనేత కార్మికులను తాగుబోతులను చేశారంటూ కించపరిచారు.
చేనేత కమిషనర్ రేఖారాణిని కలిస్తే.. ఫొటో కోసమే వచ్చారు కదా అని అవమానపరిచారు. చేనేత సహకార సంఘాలకు రూ.203 కోట్ల బకాయిలు, చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ రూ.25 కోట్లు ఇవ్వకుండానే అన్నీ ఇచ్చేసినట్టు అసెంబ్లీ సాక్షిగా మంత్రి సవిత అబద్ధాలు చెప్పారు. ఇప్పటికైనా హామీలు అమలు చేసి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలి. – పిల్లలమర్రి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం
బ్రిటిష్ కాలంలో లేని పన్నులు వేశారు
బ్రిటిష్ కాలంలో సైతం చేనేతపై పన్నులు లేవు. జీఎస్టీలో చేనేత చేర్చి 18శాతం పన్ను వసూలు చేయడం దారుణం. పవర్‌లూమ్స్‌కు 6శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న ప్రభుత్వం హ్యాండ్లూమ్‌కు 18 శాతం వసూలు చేయడం దుర్మార్గం. జీఎస్టీని ఎత్తివేసి చేనేత రంగానికి ఊతమివ్వాలి. రాష్ట్రంలో చాలా మందికి ఉచిత విద్యుత్ అందకపోయినా చెప్పుకోలేకపోతున్నారు. ప్రతి చేనేత కార్మికుడికి ఆంక్షలు లేకుండా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయాలి. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తాం. – కూరపాటి కోటేశ్వరరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకుడు
ఈయన పేరు సాన రామలక్ష్మయ్య. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని శ్రామికనగర్‌లో ఉంటున్నారు. 58 ఏళ్ల వయసున్న రామలక్ష్మయ్య దాదాపు 35 ఏళ్లుగా చేనేత వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ వెలుగులు ఆయనకు అందటం లేదు. ఆ పథకంలో ఆయన పేరు లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక ఏప్రిల్ నెలకు సంబంధించి మేనెలలో వచ్చిన కరెంటు బిల్లు రూ.645 చెల్లించక తప్పలేదని వాపోతున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక తనకు ఏ స్కీమ్ రాలేదని, కనీసం ఉచిత విద్యుత్ అందించినా కరెంటు బిల్లు భారం తగ్గుతుందని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాడు.
ఈమె పేరు యర్రా నాగలక్ష్మి. పెడన నియోజకవర్గంలోని కప్పలదొడ్డికి చెందిన ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మరణించినా ధైర్యాన్ని కూడగట్టుకుని మగ్గం నేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు ఉచిత విద్యుత్ పథకం వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. అద్దె ఇంట్లో దయనీయ స్థితిలో జీవిస్తున్న నాగలక్ష్మికి ఇంటి యజమాని నోటరీ ఇవ్వలేదనే కారణం చూపి అర్హత లేదన్నారు. యజమాని నోటరీ ఇచ్చేందుకు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడంతో నాగలక్ష్మికి ఉచిత విద్యుత్ వెలుగులు అందకుండా పోయాయి. అద్దె ఇంట్లో ఉండేవారికి యజమాని నోటరీతో నిమిత్తం లేకుండా ఉచిత వెలుగులు అందించాలని నాగలక్ష్మి వేడుకుంటోంది.


