100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సర్కారు హుకుం
బోధనకు సమయం ఇవ్వకుండా టార్గెట్లా?
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
ఈ ఏడాది పది పరీక్షలకు హాజరుకానున్న 6.30 లక్షల మంది
వీరిలో 3.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులు
విద్యార్థుల ఉత్తీర్ణత ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరు మదింపు చేస్తాం. ఉపాధ్యాయ అవార్డులకు కూడా ఇదే ప్రాతిపదిక. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి. ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత బాధ్యత ఆ ఉపాధ్యాయులదే.
ఉత్తీర్ణత తక్కువగా ఉంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. 100 రోజుల ప్రణాళికలోనూ నూరు శాతం ఫలితాలు కనిపించాలి’.. పాఠశాల విద్యాశాఖ నుంచి ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందిన ఆదేశాలు... దీంతో ఉపాధ్యాయులు హడలిపోతున్నారు. - సాక్షి, అమరావతి
పదో తరగతి ఫలితాల ఆధారంగా పనితీరును ముడిపెట్టడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పాఠాలు చెప్పడానికి సమయం లేకుండా చేసి 2025–26 విద్యా సంవత్సరంలో శతశాతం ఫలితాలు సాధించాలని టార్గెట్ విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2014–19లోనూ ఇదే తీరు అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు. తక్కువ ఉత్తీర్ణత వచ్చిన సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కొందరు టీచర్లను సస్పెండ్ కూడా చేశారు. దీంతో ఇప్పుడూ పాత విధానమే అనుసరిస్తారని, ఇలాగైతే ఉద్యోగాలు చేయలేమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. 2024–25 విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలు ఈ ఏడాది మేలో ప్రకటించారు. మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పుకునేందుకు మార్కులకు గేట్లెత్తాశారు. అయినా 2023–24 ఫలితాలతో పోలిస్తే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది.
బోధనకు దూరమైన ఉపాధ్యాయులు
ప్రస్తుత విద్యా సంవత్సరం 2025 జూన్ 12న ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో జూన్ నెల మొత్తం ఉపాధ్యాయులకు ఇతర విధులు అప్పగించింది. జూలైలో మెగా పీటీఎం పేరుతో హడావుడి చేశారు. ఇందుకోసం రోజుకో నివేదిక పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం, సరిగాలేదని మళ్లీ అడగడంతో నివేదికల నమోదుతోనే కాలం కరిగిపోయింది. పీటీఎం పూర్తయ్యాక కూడా ఆయా కార్యక్రమాల నిర్వహణ ఫొటోలు, వీడియోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా లీప్‌యాప్‌లో కొత్తగా మాడ్యూల్ సృష్టించారు. అయితే, ఆయా ఫొటోలు, వీడియోలు సరిగా లేవని దాదాపు 10 రోజుల పాటు అప్‌లోడ్‌తోనే కాలం గడిపారు. ఆగస్టులో ఫార్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు రావడంతో ఉపాధ్యాయులంతా తలలు పట్టుకున్నారు. సిలబస్ పూర్తికాకుండానే విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయలేక ఆందోళన చెందారు.
ఇంతలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన అసెస్‌మెంట్ బుక్స్‌పై శిక్షణ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులపై అవగాహన పేరుతో విద్యా సంవత్సరంలో సగం కాలం గడిచిపోయింది. మరోపక్క వారం వారం స్వచ్ఛాంధ్ర విధులు, ఇప్పుడు కొత్తగా ముస్తాబు పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులను బోధనేతర పనులతో బిజీగా మార్చేశారు.
సెలవులు బంద్
బోధనేతర పనులు చెప్పి ఇప్పుడు ఫలితాలు 100 శాతం రాకుంటే చర్యలు తప్పవంటూ ఆదేశాలివ్వడంతో గురువులు హడలిపోతున్నారు. ప్రభుత్వ సెలవులు, పండగ రోజుల్లో కూడా శిక్షణ ఇవ్వాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు కోసం 75 రోజుల ప్రణాళిక అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పాఠాలు చెప్పనీయకుండా బోధనేతర పనులు చెప్పి ఇప్పుడు 100 శాతం ఫలితాలు సాధించాలని హుకుం జారీ చేయడంపై టీచర్లు మండిపడుతున్నారు.
ప్రభుత్వ తీరుతో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అవకాశం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు టార్గెట్‌ను చేరుకునేందుకు జవాబు పత్రాల మూల్యాంకనంలో జవాబుదారీతనం లోపించే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఉత్తీర్ణత శాతం పెరిగినా నాణ్యత ఉండదంటున్నారు.
గతేడాది పడకేసిన ‘పది’ ఫలితాలు
2026–మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో దాదాపు 3.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులు ఉన్నారు. 2023–24 విద్యాసంవత్సరంతో పోలిస్తే 2024–25లో 5.55 శాతం ఫలితాలు తగ్గిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యా సంస్కరణల ఫలితంగా మెరుగైన ఫలితాలు వచ్చాయి.
2023–24 విద్యా సంవత్సరంలో 2083 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. చంద్రబాబు సర్కారు విధానాలతో 2024–25లో ఫలితాలు తారుమారయ్యాయి. ఉత్తీర్ణత పెంచడానికి అడ్డదారులు ఎన్ని ఎంచుకున్నా 100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య మాత్రం 1680కే పరిమితమైంది.


