
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్‌ని జీర్ణించుకోలేకపోతున్న సర్కారు
వీలైనంత ఎక్కువ మందిపై కేసులు పెట్టాలని హుకుం
మార్కెట్ యార్డులోకి చొచ్చుకొచ్చారని, మామిడి కాయలను తొక్కారని కేసులు
సాక్ష్యం చెప్పాలని పలువురు అధికారులపై పోలీసుల ఒత్తిళ్లు
ఓ ర్యాంప్ యజమానిపైనా కేసు పెట్టేందుకు యత్నం
ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన రైతులకు బెదిరింపులు
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సూపర్ సక్సెస్ కావడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఆ కార్యక్రమానికి తండోపతండాలుగా తరలి వచ్చిన రైతులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే కుట్రలకు పదును పెట్టింది. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు రైతులు, అభిమానులు రాకుండా కూటమి పెద్దలు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని పోలీసులందరినీ రంగంలోకి దింపి అడుగడుగునా అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఎంతో మంది నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు పలువురిని బైండోవర్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు, అభిమానులను చూసి కూటమి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై దాడి అంటూ బూచిగా చూపి కొందరిపై, రోడ్లపై మామిడి కాయలు పారబోశారంటూ మరికొందరిపై కేసులు నమోదు చేయించారు.
ఇది చాలదన్నట్లు పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, గంగాధర నెల్లూరు, చిత్తూరుకు చెందిన వినోద్, మోహన్, చక్రిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైల్లో పెట్టేందుకు బలమైన సాక్ష్యాలను సృష్టించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
కక్షగట్టి కేసుల నమోదు
ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై దాడి చేశారనే నెపంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరి కొందరి పేర్లు చెప్పించేందుకు వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోగ్రాఫర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్న నేతలను సైతం గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మార్కెట్ యార్డులోకి చొరబడ్డారని, మామిడి కాయలను తొక్కారని మరికొందరిపై కేసులు పెట్టేందుకు వ్యవసాయ, సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది.
మామిడి కాయలు కింద పారబోసిన ఘటనలో సంబంధమే లేని ర్యాంపు యజమానిపై కేసు నమోదు చేసేందుకు యతి్నస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీ నేతలే వారి తోటలోని కాయలు తీసుకొచ్చి కావాలనే రోడ్డుపై పారబోశారని కేసులు నమోదు చేశారు. తాజాగా సమీపంలోని ర్యాంపు యజమానే మామిడి కాయలు పంపించారని, అతనిపైనా కేసు నమోదు చేసేందుకు సాక్ష్యం కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న వారిపై దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఎల్లో మీడియా దు్రష్పచారం చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆగ్రహం వ్యక్తం చేసిన వారిపై ఎల్లో గ్యాంగ్ ఫోన్లు చేసి తీవ్రంగా బెదిరిస్తోంది.