స్క్వేర్‌ ఫీటు.. ‘హై’రేటు | Government orders allowing work outside the permanent High Court building | Sakshi
Sakshi News home page

స్క్వేర్‌ ఫీటు.. ‘హై’రేటు

Jun 6 2026 4:39 AM | Updated on Jun 6 2026 4:40 AM

Government orders allowing work outside the permanent High Court building

హైకోర్టు శాశ్వత భవనం వెలుపల పనులకు రూ.547.07 కోట్లు

పనులు చేపట్టేందుకు ఏజీఐసీఎల్‌కు అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు 

రూ.2,027.76 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం 

ప్రస్తుతానికి చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,978 

నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందో? 

ఇప్పటికే హైకోర్టు తాత్కాలిక భవనాన్ని రూ.173 కోట్లతో నిర్మించిన సర్కార్‌ 

శాశ్వత భవనం పూర్తయితే తాత్కాలిక భవనానికి చేసిన వ్యయం వృథానే 

సాక్షి, అమరావతి: రాజధానిలో అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ) ప్రాంతంలో ‘ఎఫ్‌’ బ్లాక్‌లో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రూఫ్‌టాప్‌ ఎలివేషన్‌ కోసం ప్రీకాస్ట్‌ పిన్స్‌ నిర్మాణం, ఆ భవనం వెలుపల పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్, అంతర్గత రోడ్డు, సబ్‌స్టేషన్, వాటర్‌ బాడీస్‌ వంటి పనులు చేపట్టేందుకు  ప్రభుత్వం మరో రూ.547.07 కోట్లను మంజూరు చేసింది. 

ఈ పనులను డిజైన్, బిల్డ్‌ లంప్సమ్‌ విధానంలో టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు అప్ప­గించేందుకు ఏజీఐసీఎల్‌(అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)కు అనుమ­తిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,978లకు చేరింది. హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్‌’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, ఏడు అంతస్తులు(బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ డిజైన్‌ను పోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థ రూపొందించింది.  

రూ.924.69 కోట్ల నుంచి రూ.2,027.76 కోట్లకు..
హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో 4.52 శాతం అధిక (ఎక్సెస్‌) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ చేజిక్కించుకుంది.. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్‌లో సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.

ఇక ఈ భవనానికి హైసైడ్‌ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ(హీటింగ్‌ వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ(సీసీ టీవీ, ఫైర్‌ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.547.07 కోట్ల మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. సుప్రీం కోర్టుకు కొత్తగా 86,500 చదరపు మీటర్లు(9,31,078.25 చదరపు అడుగులు)లో రూ.800 కోట్ల వ్యయంతో అదనపు భవనం నిర్మిస్తున్నారు. 

అంటే.. సుప్రీం కోర్టు కొత్త భవనం కంటే 11,01,152.75 (రెట్టింపు) చదరపు అడుగులు ఎక్కువ నిర్మిత ప్రాంతంతో హైకోర్టు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కేసులు సు­ప్రీం కోర్టులో విచారణకు వస్తాయి. అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్లతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది.  

నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఎంతకు చేరుతుందో? 
రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయంతో ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చునని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. 

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో ఇటాలియన్‌ మార్బుల్స్‌తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి 4,500కు మించదని గుర్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణంలో దుబారా చేస్తూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement