ఉప్పు రైతుకు మంచి రోజులు

Good days for the salt farmer in AP - Sakshi

ఆశాజనకంగా ధరలు.. 

ఆనందంలో సాగుదారులు 

75 కిలోల బస్తా ధర రూ.225కు పెరుగుదల 

గత 70 ఏళ్లలో ఇదే అత్యధికం 

ప్రకాశం జిల్లాలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఉప్పు సాగు  

సింగరాయకొండ: సరైన ధర లభించక ఎప్పుడూ డీలా పడే ప్రకాశం జిల్లా ఉప్పు రైతులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయి. వాతావరణం అనుకూలించడంతో ఉప్పు ధరలు అనూహ్యంగా పెరిగాయి. జిల్లాలో చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లో నాలుగు వేల ఎకరాల్లో ఉప్పును సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో తప్ప మిగిలిన కాలాల్లో ఉప్పు సాగులో ఉంటుంది. ప్రతి నెలా సుమారు 20 వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 75 కిలోల ఉప్పు బస్తా నాణ్యతను బట్టి రూ.170 నుంచి రూ.225 వరకు పలుకుతోంది. గత 70 ఏళ్లలో ఇదే అత్యధిక ధర కావడంతో సాగుదార్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గతం పీడ.. 
2014–2019 వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల బస్తా ఉప్పు రూ.60 నుంచి రూ.120 పలకడంతో రైతుకు నష్టాలే మిగిలాయి. దీనికి తోడు వ్యాపారుల సిండికేట్‌తో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ఏడాది ముందే వర్షాలు కురవడంతో ఆగస్టు నుంచే ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో ఉప్పుకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి రోజుకు 20 లారీల ఉప్పు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, తెలంగాణ, మహారాష్ట్రకు  సరఫరా అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. 

గతంలో నష్టపోయాం 
గతంలో వ్యాపారుల సిండికేట్‌తోపాటు, «వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరలు లేక తీవ్రంగా నష్టపోయాం. ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. వ్యాపారుల సిండికేట్‌ లేకపోతే ఇంకా మంచి ధర లభిస్తుంది.  
– పాకనాటి రమణారెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం 

నాడు రూ.40కే అమ్మాను  
గత 30 ఏళ్లుగా ఉప్పు సాగు చేస్తున్నా. నాకు ఊహ తెలిశాక 75 కిలోల ఉప్పు బస్తా ధర రూ.180 ఉండటం ఇదే తొలిసారి. గతంలో గిట్టుబాటు ధరలు లేక రూ.40కే అమ్మాను.   
– సామంతుల ఆదినారాయణరెడ్డి, ఉప్పు రైతు, బింగినపల్లి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top