ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్ ఏర్పాటు చేస్తూ 2021 నవంబర్ 3న జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో
అన్నదాతలకు 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్నదే లక్ష్యం
‘ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్’ పేరుతో ప్రతిపాదన
22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను ఈ డిస్కం పరిధిలోకి తేవాలని నాడే నిర్ణయం
ఈ క్రమంలోనే సెకీతో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం
దీనిపై ఎన్నికల ముందు వరకు విషం చిమ్మిన చంద్రబాబు అండ్ కో
తీరా ఇప్పుడు అదే సౌర విద్యుత్ కోసం అడుగులు ముందుకు వేసిన బాబు సర్కారు
జగన్ మొదలుపెట్టిన ప్రయత్నాలు కొనసాగించేలా కేబినెట్‌లో ఆమోదం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పాతికేళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగించక తప్పలేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా.. తుదకు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే మంచివనే నిర్ణయానికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చింది.
ప్రస్తుతం మూడు డిస్కంల ఆధ్వర్యంలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి (క్యాబినెట్) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో విజన్ ఉన్న నాయకుడు జగన్ అని మరోసారి రుజువైంది. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవడంతో పాటు అధికారంలోకి వచ్చాక వారికి మంచి చేయాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌కు అప్పట్లో పంట చేలల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతన్నలు అడుగడుగునా తమ గోడును చెప్పుకున్నారు. రాత్రనకా, పగలనకా సాగు నీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ, విద్యుత్ కోసం పడుతున్న బాధలను కన్నీళ్లతో వివరించారు.
వారి కష్టాలను కళ్లారా చూసిన జగన్.. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా చేయాలనుకున్నారు. అది కూడా పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా అందించాలనుకున్నారు. అది సౌర విద్యుత్ వల్లనే సాధ్యమవుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఫీడర్లను అప్‌గ్రేడ్ చేయడం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారు.
కొత్త డిస్కంకు అప్పుడే అంకురార్పణ
అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి 15న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ సమీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయాన్ని మెచ్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) 2021 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. రైతుల శ్రేయస్సు కోసం ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్ సేకరణకు ప్రయత్నించడం అభినందనీయమని ఆ లేఖలో పేర్కొంది.
యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తామే సరఫరా చేస్తామంటూ ప్రతిపాదన చేసింది. సెకీతో ఒప్పందం కోసం ఏపీజీఈసీఎల్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్)గా మార్పు చేస్తూ 2021 నవంబర్ 3న జగన్ ప్రభుత్వం జీఓ నంబర్ 152ను విడుదల చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎస్‌టీఎస్) నుంచి మినహాయింపు పొందడంలో భాగంగానే వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతితో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇది వ్యవసాయానికి అత్యంత అవశ్యకం కావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్‌కు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎల్) అనే పేరును ఖరారు చేసింది.
నాడు అంతా విష ప్రచారమని తేటతెల్లం
రాష్ట్రంలో తూర్పు (ఏపీఈపీడీసీఎల్), మధ్య (ఏపీసీపీడీసీఎల్), దక్షిణ (ఏపీఎస్‌పీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నిటినీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏపీఆర్‌ఏపీఎల్‌కు బదిలీ చేస్తున్నారు. సర్వీసులు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, స్తంభాలు ఇలా వ్యవసాయ విద్యుత్ సరఫరాకు వినియోగిస్తున్నవన్నీ కొత్త డిస్కంలో విలీనం చేస్తారు.
ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో ఇంధన శాఖ ఏపీఈఆర్‌సీకి ఫైలును పంపనుంది. మండలి ఆమోదం అనంతరం ఏపీఆర్‌ఏపీఎల్‌కు ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని ఇంధన శాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ సెకీ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల భారం పడుతుందని చంద్రబాబు అండ్ కో చేసిందంతా కూడా తప్పుడు, విష ప్రచారం అని తేలిపోయింది.


