తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి చత్తీస్‌గఢ్‌లో నిర్మించిన నవ రాయ్‌పూర్ ఉదాహరణ అని ఆయన తెలిపారు. నవ రాయపూర్‌లో బిల్డింగ్‌లు మాత్రమే ఉన్నాయని.. కానీ జనం లేరని సజ్జల పేర్కొన్నారు.
‘చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేవలం పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే కడుతున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిలు.. వీరికి బంగ్లాలు మాత్రం కడుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల్సి ఉంది. అది ఎప్పటికి అవుతుందో ఎవ్వరికీ తెలియదు.
ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేని చోట అంతంత డబ్బు పెట్టి ప్రజలు ఎలా ఉంటారు?, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ రేట్లు పెట్టి ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారు?, ప్రజలు భరించలేని రేట్లతో, ఏ సదుపాయాలూ లేని చోట ఎందుకు ఉంటారు?, మౌలిక సదుపాయాల కోసమే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?, ప్రజలు రాకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది.
మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని..
‘మా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మావిగన్ అలా కాదు.. అమరావతిలో 10 శాతంతో ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుంది. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయ్యింది. త్వరలో పోర్టుకూడా వస్తుంది. జగన్ చెప్పినదానికీ, చంద్రబాబు చెప్పిన దానికీ తేడా ఇది’ అని తెలిపారు.
ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారు?
చంద్రబాబు నాయుడు ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారని సజ్జల ప్రశ్నించారు. రాని క్యాపిటల్ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?, హెరిటేజ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?, రాజధాని పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, దానికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీశారు.
చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం
‘భావితరాలకు అన్యాయం చేస్తున్నారని జగన్ చెప్తున్నారు. మావిగన్ ఆలోచనను పలు దఫాలుగా జగన్ చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్రశ్నలకు సూటిగా చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పడంలేదు. చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం ఉంది. భూములు ఇప్పుడు అమ్మితే రేట్లు రావని చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పడు అమ్మితే వస్తాయో చెప్పగలరా?, అమ్మేంతవరకూ ఎన్ని డబ్బులు పెడతారు?, అప్పటివరకూ పెట్టే డబ్బు ఎంత? వడ్డీ ఎంత?, కాంట్రాక్టు కంపెనీలకు జీఎస్టీ సహా అనేక రాయితీలు ఇచ్చారు.
ఇక పన్నుల ద్వారా ఏరకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు. అమరావతి ఆలోచన ఆసాధ్యమైనది. దీనిపై ప్రశ్నలు అడిగితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చంద్రబాబు అమరావతి ఏరకంగా ఆచరణాత్మకమో చెప్పగలరా?, అప్పు చేయకుండా ఏం కట్టినా తప్పు లేదు. అప్పులు చేస్తున్నప్పుడు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
అవినీతికి తరగని గనిలా అమరావతి
‘చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని కామధేనువులాగ, అక్షయపాత్ర లాగ చూస్తున్నారు. గ్రో ఇంజిన్‌లాంటి క్యాపిటల్‌ను తీసుకు రావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుంది. ఆ డబ్బును మావిగన్ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుంది.
ఆరోజైనా, ఈరోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను సక్రమంగా నిర్వహించుకోవాలన్నదే మా ఆలోచన. వాటిని సహేతుకంగా ఖర్చు చేసి రాజధానిని అందుబాటులోకి సత్వరమే తీసుకు రావాలన్నదే వైయస్.జగన్ ఆలోచన. రూ.2-3లక్షల కోట్లు పెట్టినా చంద్రబాబు రాజధానిని పూర్తిచేయడం అసాధ్యం.
పైగా అన్ని అప్పులు ఇచ్చేవారు ఎవరు ?, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. చంద్రబాబు, ఆయన మనుషుల కుబేరులు అవడానికే పనికి వస్తుంది. కోర్టుల ద్వారా తెచ్చిన చిక్కుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం ఆగింది. చంద్రబాబు విశాఖపట్నం, కర్నూలుకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టులు కోసమే ఆరాటపడుతున్నారు. చివరకు అమరావతి ప్రాంత ప్రజలనుకూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాలకోసం వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నారు
మావిగన్‌ను ప్రజలు స్వాగతించారు
మావిగన్ అనే నినాదం చంద్రబాబుకు తగాలాల్సిన చోట తగిలింది. అందుకనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతికోసం కేంద్రం నుంచి రూ.30-40వేల కోట్లు గ్రాంటు తెస్తే ఎవరు అడ్డుకుంటారు?, మావిగన్‌ను ప్రజలు స్వాగతించారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు:
మావిగన్ పేరు అనగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో చర్చజరుగుతోంది. ఈ ప్రతిపాదన సహేతుకంగా ఉందని ప్రజలంటున్నారు’అని తెలిపారు.

ఆ కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది..
‘రాజధాని ప్రాంతానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం అన్న చంద్రబాబు సృష్టించిన కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది. అందుకనే ఈ ప్రాంత నాయకులు, ప్రజలుకూడా గట్టిగా చర్చిస్తున్నారు. మావిగన్ చాలా మంది ఆలోచన అని అందరూ అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని,మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబుకు అదురు, బెదురు పుట్టింది.
అందుకనే ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. ఎల్లోమీడియా ద్వారా కూడా తిట్టిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తుంటే.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబుకు షర్మిల మద్దతు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం
ఏబీఎన్‌లో దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా 30-40 మంది వైఎస్సార్‌సీపీ ప్రధాన నాయకులు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం. భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా?, మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ సమర్థించడం ఘోరం. పైగా మేం దాడిచేశామని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.
పైగా ఏబీఎన్ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిగారిని ఏదో అన్నారని, ఏకంగా ఆ మీడియాను బ్యాన్ చేయాలన్నారు.
ఇప్పుడు వేరేరకంగా మాట్లాడారు. గతంలో సాక్షిలో ఒక వక్త మట్లాడిన మాటలకు సాక్షిపై దాడులు చేశారు. దాడి అంటే అది. చాలా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మూడు రోజులుగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయి
రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే యజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి.
మావిగన్ పేరు వింటనే చంద్రబాబుకు భయం
మావిగన్ పేరు వింటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మావిగన్ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.


