విద్యార్థిని హత్యపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Shocked by Student Keerthana Incident in YSR District | Sakshi
Sakshi News home page

విద్యార్థిని హత్యపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Apr 10 2026 6:19 PM | Updated on Apr 10 2026 7:07 PM

YS Jagan Shocked by Student Keerthana Incident in YSR District

తాడేపల్లి : వైఎస్సార్‌ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. 

‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. 

దారుణానికి పాల్పడిన నిందితుడిని  కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్‌ చేశారు.  అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్‌ జగన్‌.

కాగా, వైఎస్సార్‌ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.

ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్‌(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్‌లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement