ఇక విద్య ప్రైవేటీకరణ.. ప్రైవేట్‌ వర్సిటీలకు పచ్చజెండా | State Cabinet approves Law Amendment Ordinance 2016 | Sakshi
Sakshi News home page

ఇక విద్య ప్రైవేటీకరణ.. ప్రైవేట్‌ వర్సిటీలకు పచ్చజెండా

Apr 11 2026 3:03 AM | Updated on Apr 11 2026 3:03 AM

State Cabinet approves Law Amendment Ordinance 2016

2016 చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

యూనివర్సిటీ ఏర్పాటుకి 50కి బదులు 10 ఎకరాలు చాలు

కార్పస్‌ ఫండ్‌ రూ.15 కోట్ల నుంచి రూ.5 కోట్లకు కుదింపు

మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు

ఈ వర్సిటీల్లో ప్రభుత్వ కోటాలేమీ ఉండవు

ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిషన్‌ చట్టంలో సవరణలకు ఆమోదం

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి    

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్‌ జారీని ఆమోదిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రైవేట్‌ యూనివర్సిటీలు తక్కువగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడంలో భాగంగా నిబంధనలను సరళతరం చేసినట్లు మంత్రి తెలిపారు. 

2016 చట్టం ప్రకారం యూనివర్సిటీ ఏర్పాటుకు కనీసం 50 ఎకరాలు అవసరం కాగా దీన్ని 10 ఎకరాలకు తగ్గించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వర్సిటీల కార్పస్‌ ఫండ్‌ రూ.15 కోట్లు నుంచి రూ.5 కోట్లకు తగ్గించామన్నారు. యూనివర్శిటీ ఏర్పాటుకు మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టాలనే నిబంధనను సైతం సడలించినట్లు తెలిపారు. 

మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టకుంటే ప్రైవేట్‌ యూనివర్సిటీని అధికారులు, విలేకరులు బ్లాక్‌ మెయిల్‌ చేస్తారని, అందువల్ల ఈ నిబంధనను సడలించినట్లు మంత్రి చెప్పారు. నిబంధనల సడలింపుతో ప్రైవేట్‌ వర్సిటీలు నిర్భయంగా, పారదర్శకంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ప్రభుత్వ కోటాలేమీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా..

» ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ 2025 తుది గెజిట్‌కు ఆమోదం. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు ఆరు జోన్లు కానున్నాయి. ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికత తదితరాలు గతేడాది డిసెంబర్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. 
»  ప్రభుత్వ భూమి ధరల నిర్ధారణకు సంబంధించి ఏపీ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అధారిటీ (ఏపీఎల్‌ఎంఏ) ద్వారా ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈమేరకు సంబంధిత జీవోలో సవరణలకు ఆమోదం. 
»  పట్టా భూములు మంజూరు చేసిన తేదీ నుంచి పదేళ్ల తరువాత వాటిపై హక్కులు కల్పిస్తూ గతంలో జారీ చేసిన జీవోలో సవరణలు. రెండేళ్లకే హక్కులు కల్పించేందుకు ఆమోదం. 
»  22 ఏ నిషేధిత జాబితాలోని ఆస్తుల రెగ్యులరైజ్‌కు దరఖాస్తు గడువు ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు  పొడిగింపు.
»  రాష్ట్రంలో వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణ ప్రైవేట్‌ సంస్ధలకు, వ్యక్తులకు అప్పగించేందుకు ఆమోదం. ‘అడాప్ట్‌ ఏ మాన్యుమెంట్‌’ పాలసీ’కి ఆమోదం.
»  ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ యాక్ట్‌ 2019 సవరించి ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం. కమిషన్‌కు బదులు ఉన్నత విద్య ఫీజు నిర్ధారణ కమిటీ ఏర్పాటు. 
»   ఏపీ డిస్కమ్‌ల నుంచి 11 కేవీ వ్యవసాయ ఫీడర్‌ ఆస్తులు (11 కేవీ లైన్లు, డీటీఆర్‌లు, ఎల్‌టీ లైన్లు) దశలవారీగా ఏపీ రూరల్‌ అగ్రికల్చర్‌ పవర్‌ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం. 
»  ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ విజయవాడ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.2,000 కోట్ల ప్రత్యేక రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. 
»  విశాఖలో సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మాణ గడువు 2027 జూన్‌ వరకు పొడిగించేందుకు ఆమోదం. 
»  విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి సేల్‌ అగ్రిమెంట్‌కు బదులు సేల్‌డీడ్‌గా పరిగణించేందుకు ఆమోదం. 
»  ఇంజినీర్ల మధ్య సీనియారిటీ వివాదాల పరిష్కా­రం, పరిపాలనా అవసరాలు తీర్చేందుకు 58 మంది అర్హులైన డిప్యుటీ ఈఈలకు అడ్‌హాక్‌ పదో­న్నతిపై ఈఈలుగా గుర్తించేందుకు ఆమోదం. 
»   ఏపీఐఐసీకి గతంలో ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఎకరాకు రూ.14 లక్షల చొప్పున ఏపీఐఐసీ మొత్తం రూ.1,545.46 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేందుకు ఆమోదం. 
»  ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటరింగ్‌ అమలుకు సవరించిన విధివిధానాలతో  జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. దీనిద్వారా జీఎస్‌డీపీలో 0.42 శాతం అదనంగా ప్రభుత్వానికి అప్పు చేసే అవకాశం.  
»   ఇటీవల ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement