Privatization education
-
ఇక విద్య ప్రైవేటీకరణ.. ప్రైవేట్ వర్సిటీలకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీని ఆమోదిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీలు తక్కువగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడంలో భాగంగా నిబంధనలను సరళతరం చేసినట్లు మంత్రి తెలిపారు. 2016 చట్టం ప్రకారం యూనివర్సిటీ ఏర్పాటుకు కనీసం 50 ఎకరాలు అవసరం కాగా దీన్ని 10 ఎకరాలకు తగ్గించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వర్సిటీల కార్పస్ ఫండ్ రూ.15 కోట్లు నుంచి రూ.5 కోట్లకు తగ్గించామన్నారు. యూనివర్శిటీ ఏర్పాటుకు మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టాలనే నిబంధనను సైతం సడలించినట్లు తెలిపారు. మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టకుంటే ప్రైవేట్ యూనివర్సిటీని అధికారులు, విలేకరులు బ్లాక్ మెయిల్ చేస్తారని, అందువల్ల ఈ నిబంధనను సడలించినట్లు మంత్రి చెప్పారు. నిబంధనల సడలింపుతో ప్రైవేట్ వర్సిటీలు నిర్భయంగా, పారదర్శకంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రభుత్వ కోటాలేమీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా..» ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2025 తుది గెజిట్‌కు ఆమోదం. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు ఆరు జోన్లు కానున్నాయి. ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికత తదితరాలు గతేడాది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. » ప్రభుత్వ భూమి ధరల నిర్ధారణకు సంబంధించి ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అధారిటీ (ఏపీఎల్‌ఎంఏ) ద్వారా ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈమేరకు సంబంధిత జీవోలో సవరణలకు ఆమోదం. » పట్టా భూములు మంజూరు చేసిన తేదీ నుంచి పదేళ్ల తరువాత వాటిపై హక్కులు కల్పిస్తూ గతంలో జారీ చేసిన జీవోలో సవరణలు. రెండేళ్లకే హక్కులు కల్పించేందుకు ఆమోదం. » 22 ఏ నిషేధిత జాబితాలోని ఆస్తుల రెగ్యులరైజ్‌కు దరఖాస్తు గడువు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు.» రాష్ట్రంలో వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణ ప్రైవేట్ సంస్ధలకు, వ్యక్తులకు అప్పగించేందుకు ఆమోదం. ‘అడాప్ట్ ఏ మాన్యుమెంట్’ పాలసీ’కి ఆమోదం.» ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ యాక్ట్ 2019 సవరించి ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. కమిషన్‌కు బదులు ఉన్నత విద్య ఫీజు నిర్ధారణ కమిటీ ఏర్పాటు. » ఏపీ డిస్కమ్‌ల నుంచి 11 కేవీ వ్యవసాయ ఫీడర్ ఆస్తులు (11 కేవీ లైన్లు, డీటీఆర్లు, ఎల్టీ లైన్లు) దశలవారీగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2,000 కోట్ల ప్రత్యేక రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. » విశాఖలో సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణ గడువు 2027 జూన్ వరకు పొడిగించేందుకు ఆమోదం. » విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సేల్ అగ్రిమెంట్‌కు బదులు సేల్‌డీడ్‌గా పరిగణించేందుకు ఆమోదం. » ఇంజినీర్ల మధ్య సీనియారిటీ వివాదాల పరిష్కారం, పరిపాలనా అవసరాలు తీర్చేందుకు 58 మంది అర్హులైన డిప్యుటీ ఈఈలకు అడ్హాక్ పదోన్నతిపై ఈఈలుగా గుర్తించేందుకు ఆమోదం. » ఏపీఐఐసీకి గతంలో ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఎకరాకు రూ.14 లక్షల చొప్పున ఏపీఐఐసీ మొత్తం రూ.1,545.46 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేందుకు ఆమోదం. » ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అమలుకు సవరించిన విధివిధానాలతో జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. దీనిద్వారా జీఎస్డీపీలో 0.42 శాతం అదనంగా ప్రభుత్వానికి అప్పు చేసే అవకాశం. » ఇటీవల ఎస్ఐపీబీలో తీసుకున్న పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం -
రాజకీయాలనూ శాసిస్తున్నాయ్!
- ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై స్వామిగౌడ్ - తమను ముట్టుకుంటే అంతం చేస్తామనే పరిస్థితి ఉందని ధ్వజం - టెన్త్ పాసైన వ్యక్తులు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నారని ఆవేదన - హైదరాబాద్‌లో ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్ పుస్తకావిష్కరణ - ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, చుక్కా రామయ్య తదితరుల హాజరు సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రైవేటు విద్యాసంస్థలు రాజకీయ రంగాన్నీ శాసించే స్థాయికి చేరాయి. మమ్మల్ని ముట్టుకుంటే ఎవరినై నా అంతం చేస్తామని బెదిరించే స్థాయికి వ చ్చాయి’’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మండిపడ్డారు. ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్(ఈఐ) సంస్థ ఆధ్వర్యంలో విద్య ప్రైవేటీకరణ-వ్యాపారీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు పరిశోధించి రూపొందిం చిన ‘ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్’ పుస్తకాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రైవేటు సంస్థలు భూతాల్లా విస్తరిస్తున్నాయన్నారు. పదో తరగతి పాస్‌కాని వ్యక్తులు మెడికల్ కళాశాలలను, ఏడో తరగతి చదవని వారు ఇంజనీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారంటే ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈఐ సంస్థ పరిశోధనలో తేలిన అంశాలను ప్రభుత ్వం పరిగణనలోకి తీసుకుంటుందని, అందరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా సహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణకు అందరం వ్యతిరేకమేనని, సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా సబ్సిడీలు అధికంగా ఇవ్వడంతో కీలక శాఖలకు నిధుల కొరత ఏర్పడుతోందన్నారు. ఈఐ సూచించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసికెళ్తానన్నారు. కార్యక్రమంలో ఈఐ చీఫ్ కోఆర్డినేటర్ శశిబాలాసింగ్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఆంగ్లియో, రీసెర్చ్ ఫ్రొఫెసర్లు సంగీతా కామత్, జొన్నలగడ్డ ఇందిర, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, కొంపల్లి యాదవ్రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, జాఫ్రీ, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, సుబ్బారెడ్డి, తెలంగాణ, ఏపీలకు చెందిన వివిధ జిల్లాల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


