వినికిడి సమస్యలు లేని ఏపీనే లక్ష్యం

Goal is an AP that is free of hearing problems - Sakshi

వినికిడి లోపాలను గుర్తించేందుకు నాలుగు అంచెల్లో స్క్రీనింగ్‌

పిల్లలు పుట్టగానే ఆస్పత్రుల్లో పరీక్షలు

రెండేళ్లలోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడినవారిలో ఇంటింటా సర్వే ద్వారా లోపాలు గుర్తింపు

గ్రామీణ, పట్టణ పీహెచ్‌సీ డాక్టర్లతో 104 వాహనాల ద్వారా స్క్రీనింగ్‌

రెండేళ్లపై నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు స్కూళ్లకు వెళ్లి స్క్రీనింగ్‌

శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వారికీ పరీక్షలు

కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వినికిడి లోపాలు, ఇతర సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వైఎస్సార్‌ కంటి వెలుగు తరహాలోనే చెముడుతో బాధపడేవారిని వీలైనంత త్వరగా చిన్న వయసులోనే గుర్తించి.. వారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేస్తే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు అంచెల్లో వినికిడి లోపాలు ఉన్నవారిని గుర్తించాలని సర్కార్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. పుట్టిన శిశువుతోపాటు తల్లికీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే సమయంలో వినికిడి లోపాలేమైనా ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత పిల్లలకు ఒకటో నెల, మూడో నెల, ఆరో నెల రాగానే ఆస్పత్రుల్లోనే స్క్రీనింగ్‌ నిర్వహించి వినికిడి లోపాలుంటే చికిత్స చేస్తారు. అలాగే రెండేళ్లలోపు పిల్లలు, స్కూల్‌ బయట ఉన్న పిల్లలు, 50 ఏళ్లు పైబడినవారిలో ఈ లోపాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీ డాక్టర్లతో 104 సంచార వైద్య వాహనాల ద్వారా స్క్రీనింగ్‌ను నిర్వహిస్తారు. 

పీహెచ్‌సీలు, 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్ల పై నుంచి 18 ఏళ్లలోపు వారికి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లి పరీక్షలు చేస్తారు. చెముడుతో బాధపడేవారిని గుర్తించి.. అవసరమైనవారికి ఆపరేషన్లు చేయిస్తారు. అంతేకాకుండా వారికి కావాల్సిన పరికరాలను కూడా అందిస్తారు. గ్రామీణ, పట్టణ పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 

74 ప్రభుత్వ ఆస్పత్రులు గుర్తింపు.. 
అలాగే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో కూడా వినికిడి లోపాలుంటాయని, అలాంటి వారిని కూడా గుర్తించి చికిత్సలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా శబ్ద కాలుష్యం ఉన్న పరిశ్రమల్లో పనిచేసేవారు, ట్రాఫిక్‌ పోలీసులు, డ్రైవర్లు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసించే వారిలో వినికిడి లోపాలను గుర్తించనున్నారు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయడంతోపాటు, ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ క్యాంపులను నిర్వహించనున్నారు. వినికిడి లోపాలున్నవారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేసేందుకు 74 ప్రభుత్వ ఆస్పత్రులను గుర్తించారు. ఇందుకోసం ఈఎన్‌టీ సర్జన్లు, వైద్య సిబ్బంది నియామకంతోపాటు స్క్రీనింగ్‌ పరికరాలను సమకూర్చుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికను రూపొందించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top