AP: బడుగుల భద్రతలో ఏపీ భేష్‌

Full security  And Protection For Dalits And Tribals In Andhra Pradesh - Sakshi

జాతీయస్థాయిలో ఏపీ సమర్థ పనితీరు 

2014–19తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై 20శాతం తగ్గిన కేసులు

సత్వర చర్యలతో త్వరితంగా న్యాయం

96శాతం కేసుల్లో దోషుల గుర్తింపు 

70 శాతం కేసుల్లో 60రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు 

బాధితులకు నష్టపరిహారం పెంపు 

సాక్షి, అమరావతి: దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానికి అడ్డుకట్ట వేసింది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నది. 2014–19 మేతో  పోలిస్తే 2019 జూన్‌ నుంచి 2021 జూలై వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు తార్కాణంగా నిలుస్తోంది.  

2019 నుంచి తగ్గిన కేసులు 
రాష్ట్రంలో 2015–19తో పోలిస్తే 2019–21లో దళితులు, గిరిజనులపై దాడులు, ఇతర వేధింపులు గణనీయంగా తగ్గాయి. గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యల్పంగా 2021లోనే నమోదు కావడం విశేషం.  2015తో పోలిస్తే 2020లో దళితులు, గిరిజనులపై నేరాలు 13శాతం తగ్గాయి.  ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను కేటగిరీలవారీగా పరిశీలిస్తే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో హత్య కేసులు 40శాతం, అత్యాచారం కేసులు 15శాతం తగ్గాయి,  దాడులు 6శాతం, గృహదహనాలు 38శాతం, ఎస్సీ, ఎస్టీ వేధింపులు 18శాతం, ఇతర కేసులు 12శాతం తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

తప్పు చేస్తే పోలీసులైనా కఠిన చర్యలే..  
ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడితే పోలీసులయినాసరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్నిచ్చింది. శ్రీకాకుళంజిల్లాలో కాశీబుగ్గ సీఐను 24 గంటల్లోనే అరెస్టు చేసింది. రాజమహేంద్రవరంలోని సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐను ఘటన జరిగిన రోజే అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్‌ ఎస్‌ఐను అరెస్టు చేసి చార్జ్‌ షీట్‌ కూడా దాఖలు చేశారు.  

బాధితులకు పరిహారం పెంపు 
నేరాలకు గురయిన దళితులు, గిరిజనులను ఆదుకోవడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచింది. 2014–2019లో టీడీపీ ప్రభుత్వం బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం రూ.52.32 కోట్లు మాత్రమే పరిహారంగా అందించింది. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 జూన్‌ నుంచి 2021 జూలై వరకు బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.87.70కోట్లు పరిహారంగా అందించడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసి బాధిత  కుటుంబాలకు సత్వరం పరిహారం అందేలా చొరవ చూపిస్తోంది.  

దేశంలోనే భేష్‌..  
ఎస్సీ, ఎస్టీల రక్షణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే  సమర్థంగా వ్యవహరిస్తోందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో లక్షమందిజనాభాలో ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను ప్రమాణంగా తీసుకుని ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదిక వెల్లడించింది.  

ఎస్సీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్ష ఎస్సీలలో రాజస్థాన్‌లో 55.6, మధ్యప్రదేశ్‌లో 46.7, బిహార్‌లో 39.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లో 34.8మందిపై, తెలంగాణలో 31.1మందిపై ఉత్తర ప్రదేశ్‌లో 28.6మందిపై, కేరళలో 28.2మందిపై, ఒడిశాలో 26.2మందిపై నేరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి 24.5 మందిపై మాత్రమే నేరాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది.

► ఎస్టీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్షమంది ఎస్టీలకు ఉత్తరప్రదేశ్‌లో 63.6మందిపై, కేరళలో 28.9మందిపై, రాజస్థాన్‌లో 19.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో 16.1మంది ఎస్టీలు దాడులకు గురవుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి కేవలం 12.5 మందిపైనే నేరాలు జరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. 

సమర్థంగా కేసుల పరిష్కారం 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి దోషులను సకాలంలో గుర్తించి శిక్షలు పడేలా చేస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితిని తీసుకువచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 94శాతం కేసుల్లో దోషులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

రికార్డు వేగంతో దర్యాప్తు  
దళితులు, గిరిజనులపై నేరాల కేసులను పోలీసు శాఖ రికార్డు వేగంతో దర్యాప్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తును టీడీపీ ప్రభుత్వంలో కంటే 78శాతం తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తుండడం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.  


కేసుల వారీగా చూస్తే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల అత్యాచారాలు, హత్యల కేసుల దర్యాప్తునకు సగటున 240 రోజులు పట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019 జూన్‌ నుంచి 2022 జూలై వరకు సగటున 55 రోజుల్లోనే విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు.  
2014 నుంచి 2019 మే వరకు  సామూహిక అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 279 రోజులు పట్టి్టంది. కాగా 2019 జూన్‌ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 153 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో అయితే 44 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం విశేషం.  
 2014 నుంచి 2019 మే వరకు పోస్కో చట్టం కేసుల దర్యాప్తునకు సగటున 192 రోజులు పట్టాయి. 2019 జూన్‌ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 133 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో కేవలం 53 రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేయడం పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. 
 2014 నుంచి 2019 వరకు అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 266 రోజులు పట్టాయి. 2019 జూన్‌ నుంచి 2020 వరకు సగటున 111 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. ఇక 2021లో కేవలం 46రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  
 ఇక టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మే వరకు ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కేసులను సమర్థంగా దర్యాప్తు చేసి పూర్తి చేశారు. ఆ విధంగా అత్యాచారం– హత్య కేసులు 3, సామూహిక అత్యాచారం కేసులు 2, పోస్కో చట్టం కేసులు 19, అత్యాచారం కేసులు 64ను దర్యాప్తు పూర్తి చేయడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top