ఒక్క రూపాయికే పక్కా ఇల్లు

Free Housing For Urban Poor People Achieve YS Jagn Assurance - Sakshi

మాటే మంత్రంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్రాభివృద్ధే ఆశయంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారు. ఒకే ఒక్క రూపాయికి లక్షలాది రూపాయలు విలువచేసే పక్కా ఇంటిని పేదలకు అందించే బృహత్తర కార్యక్రమానికి విజయనగరంలోని సారిపల్లి వేదికగా మారింది. సకల సదుపాయాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లను మంత్రులు ప్రారంభించి లబ్ధిదారులకు గురువారం అప్పగించనున్నారు.   

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ పత్రాలను చేతికి అందిస్తానన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి హామీ సాకారమవుతోంది. విజయనగరానికి సమీపంలోని సారిపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సిద్ధమైంది. 800 ఇళ్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఆయా లబ్ధిదారులకు ఇంటిపత్రాలను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. విద్యుత్‌దీపాల కాంతులతో కాలనీలోని ఇళ్లు జిగేల్‌మంటున్నాయి.  

అందంగా.. విశాలంగా..  
విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్యయంతో 2,656 ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఏ–కేటగిరిలో 300 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంతో 1,536 ఇళ్లు, బి–కేటగిరీలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి–కేటగిరీలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో 928 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమైన 800 ఇళ్లను లబ్ధిదారులకు గురువారం మంత్రుల చేతుల మీదుగా అందించడానికి ఏపీ టిడ్కో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

లక్షల ఆస్తి ఒక్క రూపాయికే... 
రాష్ట్ర ప్రభుత్వం ఏ–కేటగిరి కింద ఒక్కో ఇంటిని రూ.6.55 లక్షల వ్యయంతో నిర్మింస్తోంది. ఆ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తోంది. మిగతా రూ.5.05 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంమీద లబ్ధిదారులకు మాత్రం కేవలం ఒక్క రూపాయికే రూ.6.55 లక్షల విలువగల ఇంటిని అందజేస్తోంది. సి–కేటగిరీ కింద నిర్మించే 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఒక్కోదానికి రూ.8.55 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షలు సమకూర్చుతోంది. లబ్ధిదారు తన వాటా కింద రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కింద రూ.3.65 లక్షలను అధికారులు సమకూరుస్తున్నారు. 

రూ.41 కోట్లతో మౌలిక సదుపాయాలు... 
సారిపల్లిలోని జగనన్న టిడ్కో కాలనీ లేఅవుట్‌లో లబ్ధిదారుల ఇళ్లకు సామాజిక, మౌలిక వసతులు కల్పించేందుకు రూ.41.02 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తాగునీటి సరఫరా కోసం రూ.8.93 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.61 కోట్లు, విద్యుత్‌ సరఫరా కోసం రూ.3.97 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మాణానికి రూ.4.92 కోట్లు, కాలనీ చుట్టూ రిటైనింగ్‌ వాల్‌ కోసం రూ.11.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే, విజయనగరం శివారు సోనియానగర్‌లో 1120 ఇళ్లు, నెల్లిమర్లలో 570, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 మొత్తం 3,712 ప్లాట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తిచేసి వచ్చే డిసెంబర్‌ నాటికి లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.     

ఇంట్లో చక్కని వసతులు... 
ఇళ్లలో పూర్తిగా టైల్స్‌తో కూడిన గచ్చు ఏర్పాటు చేశారు. బెడ్‌ రూమ్, లివింగ్‌ రూమ్‌ ఆకట్టుకునేలా రూపొందించారు. గ్రానైట్‌ ఫ్లాట్‌ఫాంతో కూడిన వంటగది, సింక్‌ చక్కగా ఉన్నాయి. ఆధునిక వసతులతో కూడిన టాయిలెట్‌ కూడా ఉంది. ఇక కాలనీలో 40 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్ల నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. విద్యుత్‌ సరఫరా ఇప్పటికే కల్పించారు. అన్ని వసతులతో సిద్ధమైన ఇళ్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేయనున్నారు.    

లబ్ధిదారుల చేతికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు... 
టిడ్కో కాలనీలో ఇళ్ల మంజూరుపత్రాలతో పాటు లబ్ధిదారుల పేరిట రిజి  స్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్లను కూడా మంత్రుల చేతుల మీదుగా అందజేస్తాం. తొలివిడతలో ఏ–కేటగిరీకి సంబంధించిన 15 బ్లాకుల్లోని 480 ఇళ్లు, సి–కేటగిరీకి సంబంధించి 10 బ్లాకుల్లోని 320 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను సిద్ధం చేశాం. లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చులు, వ్యయప్రయాసలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి డాక్యుమెంట్లను ఇస్తాం. సారిపల్లి లే అవుట్‌లో మిగిలిన 1,856 ప్లాట్లను ఆగస్టునాటికి సిద్ధం చేస్తాం.  
– ఎస్‌.జ్యోతి, ఎస్‌ఈ, ఏపీటిడ్కో 

(చదవండి: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top