నేడు 9.48 లక్షల రైతుల ఖాతాలకు ఉచిత పంటల బీమా పరిహారం

Free Crop Insurance Compensation To Above 9 Lakh Farmers accounts today - Sakshi

పంటలు కోల్పోయిన రైతన్నల బ్యాంకు ఖాతాలకు రూ.1,252 కోట్లను జమ చేయనున్న సీఎం జగన్‌

రైతులపై భారం పడకుండా వారు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపు

2019 సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఏడాది తిరగకముందే బీమా పరిహారం 

సాక్షి, అమరావతి: రైతన్నలకు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ రంగం సిద్ధం చేశారు. ఆరుగాలం కష్టపడి.. తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారాన్ని అందించనున్నారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. 

రాష్ట్రంలో ఇదే తొలిసారి..
గతంలో చంద్రబాబు సర్కార్‌ ఎప్పుడూ పంటలు కోల్పోయిన రైతులకు సకాలంలో బీమా సొమ్ము చెల్లించలేదు. పైగా రైతులపై ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం మోపింది. దీంతో రైతులు బీమా సౌకర్యం పొందలేకపోయారు. రైతన్నల బాధకు చలించిపోయిన సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకున్నారు. రైతుల తరఫున బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 2019 సీజన్‌లో పంట నష్టానికి ఏడాది తిరగకముందే బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పారదర్శకతకు పెద్దపీట
ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్‌ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top