ఉపాధి కూలీల ఊపిరి తీసిన టిప్పర్‌ | Four MGNREGA workers run over by truck in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల ఊపిరి తీసిన టిప్పర్‌

May 17 2026 5:52 AM | Updated on May 17 2026 5:52 AM

Four MGNREGA workers run over by truck in Andhra Pradesh

టిప్పర్‌ ఢీకొని నలుగురు మహిళా ఉపాధి కూలీల దుర్మరణం 

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు  

రోడ్డుపై మస్తర్‌ వేస్తుండగా కూలీలపైకి దూసుకొచి్చన టిప్పర్‌ 

కాకినాడ బైపాస్‌లో కొవ్వూరు వంతెన వద్ద ఘటన 

కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉపాధి కూలీలు, మృతుల కుటుంబ సభ్యుల ధర్నా 

బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి కన్నబాబు పరామర్శ

కాకినాడ రూరల్‌: ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లిన కూలీలపైకి టిప్పర్‌ లారీ మృత్యువులా దూసుకొచ్చింది. నలుగురు మహిళా కూలీలను కబళించింది. ఈ ఘటన కాకినాడ రూరల్‌ మండలం బైపాస్‌ రోడ్డులోని కొవ్వూరు వంతెన వద్ద శనివారం ఉదయం 6.20 గంటలకు జరిగింది. కాకినాడ రూరల్‌ మండలం చీడిగ గ్రామానికి చెందిన 20 మంది ఉపాధి హామీ పథకం కూలీలు పంట కాలువలో పూడిక తీత పనుల కోసం వచ్చారు. వారికి ఆన్‌లైన్‌లో మస్తర్లు వేసేందుకు పని ప్రదేశంలో ఇంటర్నెట్‌ సిగ్నల్‌ లేకపోవడంతో పక్కనే ఉన్న కాకినాడ బైపాస్‌ రోడ్డుపై కొవ్వూరు వంతెన వద్దకు వచ్చారు.

కూలీల్లో 12 మందికి మేట్‌ మస్తర్‌ పూర్తి చేశారు. మరో 8 మంది మస్తర్‌ కోసం రోడ్డుపై వేచి ఉండగా, ఆకస్మికంగా టిప్పర్‌ లారీ వారిపైకి దూసుకొచ్చింది. ఆరుగురిని టిప్పర్‌ ఈడ్చుకుంటూ వెళ్లి వంతనపై ఉన్న ఇనుప గడ్డర్లను ఢీకొట్టింది. దీంతో కాదా చిట్టెమ్మ (55), వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (41), చెల్లూరు అన్నవరం (67) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మట్టపర్తి అరుణకుమారిని కాకినాడ అపోలో ఆస్పత్రిలో, పాలిక నాగమణిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరి్పంచారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు కూలీలు వంతెనపై ఉన్న ఇనుప గడ్డర్ల మీదుగా రోడ్డు పక్కకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.  

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే! 
ఘటనాస్థలంలో మాంసం ముద్దలుగా మారిన నలుగురు కూలీలను చూసి సహచరులు చలించిపోయారు. నలుగురి ప్రాణాలను బలిగొన్న టిప్పర్‌ను డ్రైవర్‌ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా, కూలీలు అడ్డుకున్నారు. డ్రైవర్‌ నాగరాజును కూలీలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా టిప్పర్‌ను నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని కూలీలు చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు.

మృతదేహాలకు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉపాధి కూలీలు, మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలాన్ని అడిషనల్‌ ఎస్పీ (ఏఆర్‌) ఎస్‌.శ్రీనివాసరావు, కాకినాడ డీఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీషి, రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ పరిశీలించి కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.   

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: కన్నబాబు 
చీడిగ గ్రామానికి చెందిన ఉపాధి కూలీల మృతిపట్ల వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామ­ని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. డ్రైవర్‌ మద్యం తాగి టిప్పర్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కూలీలు చెబుతున్నారని, మద్యం విచ్చలవిడి అమ్మకాలు, వాహనాలపై నియంత్రణ లేకపోవడం వల్లే పేద మహిళా కూలీలు మృతిచెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement