విదేశీ వలస విహంగాలొచ్చేశాయ్‌.... 

Foreign Migrant Birds Arriving To Nellore Nelapattu Bird Sanctuary - Sakshi

‘నేలపట్టు’కు విదేశీ పక్షుల రాక 

వందల సంఖ్యలో పెలికాన్స్‌ సందడి 

దొరవారిసత్రం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి అతిథులు వచ్చేశాయ్‌. ప్రస్తుతం వందల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తున్నాయి. విదేశీ వలస పక్షుల్లో రారాజుగా ప్రసిద్ధి చెందిన గూడబాతులు (పెలికాన్స్‌) గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం 200కి పైగా గూడబాతులు విడిది చేస్తున్నట్లు వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలిపారు. వీటితోపాటు సీజన్‌కు ముందే ఇక్కడకు విచ్చేసిన నత్తగుళ్ల కొంగలు (ఓపెన్‌ బిల్‌స్టార్క్స్‌) 500, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్‌) 200, పెద్ద నీటికాకులు (కార్మోరెంట్స్‌) 100కి పైగా విడిది చేస్తున్నట్లు తెలిపారు. 
(చదవండి: నాణేనికి మరోవైపు.. ‘అట్టర్‌’లతో అసలుకే ఎసరు!)

ఇంకా తెడ్డుముక్కు కొంగలు, నారాయణ పక్షులు, పాముమెడ కొంగలు వంటి  పక్షులు రావాల్సి ఉంది. అయితే.. ప్రసిద్ధి చెందిన గూడబాతులకు స్థానికంగా వాతావరణం అనుకూలించకపోతే మాత్రం అవి వెనుతిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు కురిసిన వానలకు అత్తిగుంట, నేరేడుగుంట, మారేడుగుంట చెరువుల్లోకి అరకొరగా మాత్రమే నీళ్లు చేరుకున్నాయి. విడిది కోసం వచ్చిన విహంగాలు అడుగంటిన నీళ్లలోనే జలకాలాడుతూ సంచరిస్తున్నాయి. పుష్కలంగా వర్షాలు కురిసి చెరువుల్లో çపూర్తి స్థాయిలో నీళ్లు ఉంటే ఇప్పటికే వేల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తూ ఉండేవి.

చదవండి: ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top