శ్రీశైలంలోకి 1.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం | Flood flow in Krishna and Tungabhadra rivers is decreasing | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలోకి 1.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

Jul 22 2022 3:45 AM | Updated on Jul 22 2022 8:11 AM

Flood flow in Krishna and Tungabhadra rivers is decreasing - Sakshi

శ్రీశైలం జలాశయంలో జలకళ

సాక్షి, అమరావతి: పరివాహక ప్రాంతం (బేసిన్‌)లో వర్షాలు తగ్గుతుండటంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,79,093 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ జెన్‌కో 19,070 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు తరలిస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ ప్రభుత్వం 17 వేల క్యూసెక్కులను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 880.2 అడుగుల్లో 189.45 టీఎంసీలు ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణాలో వరద తగ్గింది.

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ విద్యుదుత్పత్తి ద్వారా 27,324 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ప్రవాహం తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 72,756 క్యూసెక్కులు చేరుతుండగా.. 52,775 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 100.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ప్రస్తుతానికి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం.

ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయి అయిన 885 అడుగులకు చేరినా, వరద ప్రవాహం తక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి ద్వారానే సాగర్‌కు నీటిని తరలించే అవకాశం ఉంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ తరలిస్తున్న నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 534.8 అడుగుల్లో 177.67 టీఎంసీలకు చేరుకుంది.

సాగర్‌కు దిగువన బేసిన్‌లో వర్షాలు లేకపోవడంతో పులిచింతలలోకి వరద ప్రవాహం కనిష్ట స్థాయిలో 760 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 37.64 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నిండాలంటే ఇంకా 8 టీఎంసీలు అవసరం. ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,714 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 8,972 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1742 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement