విశాఖపట్నం: స్వధార్ హోమ్స్‌లో వరుస అదృశ్యాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆరిలోవ కేంద్రం నుంచి ఐదుగురు యువతులు మాయమవడం, గతంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం రక్షణ కేంద్రాల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. కోర్టు ఆదేశాలతో సంరక్షణలో ఉండాల్సిన మహిళలే సురక్షిత ప్రాంతాల నుంచి పారిపోతుంటే, నిర్వాహకుల వైఫల్యం ఏపాటిదో స్పష్టమవుతోంది. కిటికీ గ్రిల్లులు తొలగించి వెళ్లిపోయామనే సాకులతో సరిపెట్టకుండా, ఈ వరుస ఘటనలకు అసలు కారణమేమిటి? లోపలి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు కూపీ లాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని మహిళల భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది.
గత ఘటనల నుంచి గుణపాఠం లేదా?
ఆరిలోవ, పెందుర్తి స్వధార్ హోమ్‌ల నుంచి గతంలోనూ యువతులు అదృశ్యమైన ఘటనలు నమోదయ్యాయి. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత కేసుల దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది? అదృశ్యమైన వారిలో ఎంతమంది ఆచూకీ లభించింది? భద్రతా లోపాలు గుర్తించి సరిదిద్దారా? బాధ్యులపై చర్యలు తీసుకున్నారా? అనే అంశాలపై స్పష్టత అవసరం. న్యాయస్థానాల ఆదేశాలతో రక్షణ కోసం ఉంచిన మహిళలే హోమ్‌ల నుంచి అదృశ్యమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఘటనను విడివిడిగా కాకుండా, వరుస ఘటనల వెనుక ఏవైనా ఉమ్మడి కారణాలున్నాయా అనే కోణంలోనూ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
నిర్వాహకుల బాధ్యత లే?
స్వధార్ హోమ్‌ల నుంచి మహిళలు అదృశ్యమైన ప్రతిసారీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, మహిళలు పదేపదే అదృశ్యమవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పర్యవేక్షణ, రాత్రి నిఘాపై సమగ్ర విచారణ అవసరం. మహిళలు వెళ్లిపోయారని ఫిర్యాదు చేయడంతో నిర్వాహకుల బాధ్యత ముగిసిపోదు. అదే సమయంలో, ఆధారాలు, రికార్డులు, సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా వాస్తవాలను నిర్ధారించి, నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
గతంలోనూ బంగ్లాదేశ్ యువతి అదృశ్యం
గతంలో పోలీసులకు వాట్సాప్ ద్వారా అందిన ఫిర్యాదు ఆధారంగా ఓ బంగ్లాదేశ్ యువతిని గుర్తించి రక్షించిన ఘటన చర్చనీయాంశమైంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమెను స్వధార్ హోమ్‌కు తరలించిన సమయంలోనే, ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు హోమ్ నుంచి అదృశ్యమైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామం అప్పట్లో పలు అనుమానాలకు, ప్రశ్నలకు తావిచ్చింది.ఇలాంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి సమీక్షలు నిర్వహించారు? స్వధార్ హోమ్‌లలో భద్రతా లోపాలను గుర్తించారా? అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? దర్యాప్తులో ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి? అన్న విషయాలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది.గత ఘటనలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాకముందే ఇలాంటి పరిణామాలు పునరావృతమవుతుంటే, సమస్య మూలాలను గుర్తించడంలో వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కోర్టు ఆదేశాలకే విలువ లేదా?
స్వధార్ హోమ్‌లు కేవలం ఆశ్రయం కలి్పంచే కేంద్రాలు మాత్రమే కావు. రక్షణ అవసరమైన మహిళలకు భద్రత, సంరక్షణ అందించాల్సిన బాధ్యత వాటిపై ఉంది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు అక్కడ ఉంచిన మహిళలే అదృశ్యమవుతుండటం ఆదేశాల అమలు, పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళలను హోమ్‌లకు తరలించిన తర్వాత వారి భద్రతను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారా? గత ఘటనలపై తీసుకున్న చర్యలేమిటి? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
55కు పైగా కేసులు.. ఆచూకీ ఎక్కడ?
గత రెండేళ్లలో నగరవ్యాప్తంగా మహిళల అదృశ్యానికి సంబంధించి 55కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో స్వధార్ హోమ్‌లకు సంబంధించిన కేసులెన్ని? ఎంతమంది మహిళలను గుర్తించారు? ఇంకా ఎన్ని కేసులు పరిష్కారం కాలేదు? అన్న వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదృశ్యం కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌కు కారణాలను సమీక్షించి, మహిళల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వధార్ హోమ్‌ల ఘటనలపై సమగ్ర పరిశీలన జరగాలి.
ఐదుగురు ఎలా మాయమయ్యారు?
ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పైనాపిల్ కాలనీలో ఉన్న స్వధార్ హోమ్ నుంచి ఐదుగురు యువతులు అదృశ్యం కావడం తాజా సంచలనం. గత సోమవారం రాత్రి కిటికీ గ్రిల్స్ తొలగించి వారు బయటకు వెళ్లిపోయినట్లు హోమ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వారిలో భారతదేశానికి చెందినవారితోపాటు బంగ్లాదేశ్‌కు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ, వారి ఆచూకీ లభించలేదు. అయితే ఈ ఘటనలో సమాధానం కావాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. భద్రతా పర్యవేక్షణలో ఉండాల్సిన హోమ్ నుంచి ఐదుగురు ఒకేసారి ఎలా బయటకు వెళ్లగలిగారు? కిటికీ గ్రిల్లు తొలగించే వరకు సిబ్బంది గుర్తించలేదా? రాత్రివేళ పర్యవేక్షణ ఎలా ఉంది? ఘటన జరిగిన వెంటనే చేపట్టిన చర్యలేమిటి? అదృశ్యమైన వారి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపులో పురోగతి ఎంత? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. కేవలం ఫిర్యాదు నమోదు చేసి గాలింపు చేపట్టామని చెప్పడం కాకుండా, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.


