ఈ ప్రాజెక్టుపై రహస్యం ఎందుకు?
హైవేలే 70 మీటర్ల వెడల్పుకు మించలేదు
ఐదు జిల్లాల అమరావతి రింగ్‌రోడ్డు రైతుల సమావేశంలో నిలదీసిన వక్తలు
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అమరావతి ఔటర్ రింగ్‌రోడ్ 140 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు వెడల్పుతో నిర్మించేందుకు వీలుగా భూసేకరణ చేయడం పట్ల ఐదు జిల్లాల అమరావతి రింగ్‌రోడ్డు బాధిత రైతుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ వెడల్పు 140 మీటర్లు, కూడళ్ల వద్ద 250 నుంచి 500 మీటర్ల మేర రోడ్డు నిరి్మంచాలని ప్రతిపాదించడం అర్ధరహితమని పేర్కొంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెడల్పు 70 మీటర్లకు మించి లేదని గుర్తుచేసింది. ఏపీ రైతుసంఘం రాష్ట్ర నాయకుడు పి.వి ఆంజనేయులు అధ్యక్షతన విజయవాడలో మంగళవారం ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లకు గోడలు, ఇనుప కంచెలు వేస్తే రోడ్డు వెంబడి సరిహద్దు పొలాలకు ఏ మాత్రం విలువ పెరగదని చెప్పారు. రింగ్‌రోడ్డు పోయే గ్రామాల ప్రజలను సంప్రదించకపోవడం దారుణమన్నారు. వెంటనే గ్రామసభలు పెట్టి ఈ ప్రాజెక్టుపై వాస్తవాలను రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు. పారదర్శకత లేని అప్రజాస్వామిక పద్ధతులను ప్రభుత్వం, అధికారులు విడనాడాలని కోరారు. ఐదుజిల్లాల్లోంచి వెళుతున్న అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆ జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీచేసి ఆరునెలలవుతోందన్నారు.
రైతులకు వ్యక్తిగతంగా ఎంత పొలం పోతుంది? ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే దానిపై ఒక్క రైతుకు కూడా నోటీసు రాలేదని, ఒక్కచోట కూడా గ్రామసభ నిర్వహించలేదని చెప్పారు. డీపీఆర్ గురించి సీఆర్‌డీఏ అధికారులను, కలెక్టర్లను, రెవెన్యూ మంత్రిని ఎవరినడిగినా సమాధానం లేదన్నారు. ఈ ప్రాజెక్టు విషయాన్ని అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సామాజిక అధ్యయనం రిపోర్టుగానీ, డీపీఆర్‌గానీ రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం గ్రామసభలు పెట్టి రైతులకు వాస్తవాలు చెప్పి వారి అనుమానాలను తీర్చకపోతే బాధిత రైతుల తరఫున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.


