సీఎం పీఏ పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు

Fake message in the name of CM PA to Bangalore Manipal Hospital MD - Sakshi

కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

ప్రాథమిక దర్యాప్తులో పాతనేరస్తుడిగా గుర్తింపు

సాక్షి, తాడేపల్లి రూరల్‌:  సీఎం పీఏనంటూ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఎండీకి ఫేక్‌ మెసేజ్‌ పంపి డబ్బులు డిమాండ్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ శేషగిరి తెలిపిన వివరాల ప్రకారం సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినంటూ మణిపాల్‌ ఆస్పత్రి ఎండీకి ఓ మెసేజ్‌ పంపించాడు.

ఆ మెసేజ్‌లో ఇంటర్నేషనల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆంధ్రాకు చెందిన రుక్కిబుయ్‌ అనే యువకుడు సెలెక్ట్‌ అయ్యాడని, అతడికి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కిట్‌ అవసరమయ్యిందని, దానిని కొనుగోలు చేసేందుకు రూ.10,40,440ను పంపించాలని మెసేజ్‌ పెట్టాడు. బెంగళూరులో ఉన్న మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఎండీ  తాడేపల్లిలోని మణిపాల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఆ మెసేజ్‌ను పంపించి పరిశీలించాలని ఆదేశించారు. అది ఫేక్‌ మెసేజ్‌గా గుర్తించి జరిగిన ఘటనపై రామాంజనేయరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

మణిపాల్‌ హాస్పిటల్‌ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెసేజ్‌ పెట్టిన సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సదరు ఫేక్‌మెసేజ్‌ పెట్టిన వ్యక్తి ఉమ్మడి ఏపీలో పలువురు ప్రముఖుల పేర్లతో కార్పొరేట్‌ కంపెనీలకు ఫోన్‌ చేసి డబ్బులు వసూలు చేసిన  ఘటనలపై ఆరు కేసులు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్యకాలంలో నెల్లూరులో ఓ మంత్రి పీఏ నంటూ ఫోన్‌ చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

చదవండి: (దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు: అంబటి రాంబాబు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top