
నకిలీ మద్యంలో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్ర
టీడీపీ పెద్దలతో లింకులు, ఆర్థిక లావాదేవీల సమాచారం అందులోనే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో కరకట్ట బంగ్లా డైరెక్షన్‌తో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావుకు టీడీపీ పెద్దలతో లింకులు ఉన్నట్లు బహిర్గతం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయోనని ముఖ్యనేతలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ తరహాలో విస్తరించిన నేపథ్యంలో జనార్దనరావు నోరు తిప్పితే తమ కొంప కొల్లేరు అవుతుందని ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారు.
నకిలీ మద్యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగారు. జనార్దనరావు తమ డైరెక్షన్‌లో లొంగిపోయేలా డ్రామాకు తెర తీశారు. ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారంలో కరకట్ట బంగ్లాకు నెల వారీగా రూ.కోట్లాది ముడుపులు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావు ఫోన్ తాజాగా అదృశ్యమైంది. జనార్దనరావును అరెస్టు చేసిన తరువాత ఫోన్ గురించి పోలీసులు ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని చెప్పినట్లు కట్టుకథ అల్లారు.
లొంగిపోయే వరకు టచ్‌లోనే..!
అద్దేపల్లె జనార్దనరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తరువాత రాష్ట్రంలో పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేశారు. అందులో వెల్లడైన విషయాలను వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారు. దీనినిబట్టి కరకట్ట బంగ్లాతో పాటు పలువురు టీడీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. జనార్దనరావు ఫోన్ దొరికితే పలువురు టీడీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులు, ఫోన్ సంభాషణలు వెలుగు చూస్తాయని ముందు జాగ్రత్తగా మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే వరకు టీడీపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే కేసును నీరుగార్చే కుట్రలకు పదును పెట్టినట్లు సమాచారం. విదేశాలకు వెళ్లే సమయంలో మైలవరం ప్రజాప్రతినిధి బావ మరిదికి అద్దేపల్లి జనార్దనరావు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.