రోబో సర్వింగ్‌.. చీర్‌ గాళ్స్‌ హంగామా.. వేడుక ఏదైనా.. | Event Management Companies Growing Demand | Sakshi
Sakshi News home page

రోబో సర్వింగ్‌.. చీర్‌ గాళ్స్‌ హంగామా.. వేడుక ఏదైనా..

Apr 30 2022 2:47 PM | Updated on Apr 30 2022 2:47 PM

Event Management Companies Growing Demand - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: కల్చర్‌ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం నెలల తరబడి కసరత్తు జరిగేది. ఊరూవాడా కలిసి వివాహ వేడుకల్లో పాలుపంచుకునేది. కానీ రోజులు మారాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు తదితర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమకు నచ్చిన విధంగా వీటిని నిర్వహించే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉంటే చాలు.. ఒక్క ఫోన్‌ కాల్‌తో పిసరంత కష్టం లేకుండా కావలసినవన్నీ స్మార్ట్‌గా సిద్ధమైపోతున్నాయి. ఇక ఏర్పాట్ల హడావుడి లేకపోవడంతో కుటుంబం అంతా సంతోషంలో హైలెస్సా అంటూ ఎంజాయ్‌ చేస్తోంది.

అదరహో అనిపించేలా.. 
కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల ధగధగలతో కల్యాణ వేదికలు కనువిందు చేస్తాయి. స్వర్గలోకాన్ని తలపించే స్వాగత ద్వారాలు అలరిస్తాయి. అక్కడ మంచు, వర్షం కురుస్తున్న అనుభూతి కలిగించే భారీ సెట్లు, ఫైర్‌ షాట్లు అబ్బుర పరుస్తాయి. విందారగించేందుకు లెక్కకు మిక్కిలి రుచులు కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. నిశ్చితార్థం, మెహందీ, సంగీత్, హల్దీ, వివాహం, రిసెప్షన్‌ తదితర వేడుకలతో పాటు ఫొటో షూట్లు, వధూవరుల ఊరేగింపు వంటి ఏర్పాట్లన్నీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లే సమకూరుస్తాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు.. 
ఇక ఫంక్షన్‌కు వచ్చే వారికి వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఉర్రూతలూగించే డ్యాన్స్‌ కార్యక్రమాలు, లైవ్‌ మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌లు ఉంటాయి. వచ్చిన వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు హుషారైన యాంకర్‌లు ఉంటారు. ఇంకా పెళ్లి పందిళ్లు, పురోహితులను సమకూర్చే బాధ్యతలను తీసుకునే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లూ ఉన్నాయి. విజయవాడ నగర పరిధిలో వందకు పైగా ఈవెంట్‌ మేనేజిమెంట్‌ సంస్థలున్నాయి. వీటిలో 50 వరకు నాణ్యమైన, పది అత్యంత నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నవిగా గుర్తింపు పొందాయి.  

రోబో సర్వింగ్‌.. చీర్‌ గాళ్స్‌ హంగామా..
పెళ్లిళ్లకు వచ్చిన వారికి రోబోలతో స్వాగతం పలకడం, సర్వింగ్‌ చేసే సరికొత్త ట్రెండ్‌ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి రష్యాకు చెందిన చీర్‌ గాళ్స్‌ (నలుగురైదుగురుండే బృందం)ను రప్పించి వారితో వయ్యారాలొలికిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. స్వాగత ద్వారాల వద్ద వీరిని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. రోబోలు, చీర్ గాళ్స్‌ సంస్కృతి హైదరాబాద్‌లో ఇప్పటికే ఉంది. ఇటీవల కొంతమంది స్థితిమంతులు విజయవాడలోనూ ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. రోబోకు రూ.50–60 వేలు, చీర్‌ గాళ్స్‌కు రూ.50–70 వేల వరకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సరికొత్తగా కొన్ని వివాహాల్లో కేరళ డ్రమ్స్, పంజాబీ డోలు వాయిద్యాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు.

రూ.లక్షల్లో ప్యాకేజీలు..
పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఖర్చు ఎంత అన్నది కాదు.. పెళ్లి ఎంత ఘనంగా చేశామా? అన్నదే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. వివాహ వేడుకలకు ఎంత వెచ్చిస్తే అంత స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్న వారూ ఉన్నారు.  
దీంతో ఈవెంట్‌ మేనేజర్లు విందు భోజనాలు, కల్యాణ మండపాల డెకరేషన్, విద్యుదలంకరణ, ఫొటో, వీడియో షూట్లు, డ్యాన్స్‌ కార్యక్రమాలు, లైవ్‌ మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌లు వంటి వాటికి వేర్వేరు ధరలు నిర్ణయిస్తున్నారు. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగాను, అలాకాకుండా వేర్వేరు ప్యాకేజీలుగాను వెసులుబాటు కల్పిస్తున్నారు. 
డెకరేషన్‌కు కనీసం రూ.లక్ష నుంచి ఏడెనిమిది లక్షలు, ఫొటోగ్రఫీ/ఫొటో షూట్‌లకు రూ.70 వేల నుంచి రూ.5–6 లక్షలు, విందు భోజనాలకు రూ.లక్ష నుంచి రూ.5–6 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు.  
విజయవాడలో కొంతమంది స్థితిమంతులు వివాహ వేడుకలకు రూ.30 లక్షలు వెచ్చిస్తున్న వారూ ఉన్నారు.  
మునుపటికి భిన్నంగా ఇటీవల పలువురు డెకరేషన్‌ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విజయవాడలోని అమ్మ ఈవెంట్స్‌ నిర్వాహకుడు అనిల్‌కుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు.

కావాల్సిన విధంగా..
నా వివాహం ఇటీవల విజయవాడలో జరిగింది. రిసెప్షన్‌ ఘనంగా చేసుకోవాలనుకున్నాను. స్నేహితుల సాయంతో నగరంలో పేరున్న ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలను సంప్రదించాను. చివరకు ఓ ఈవెంట్‌ సంస్థకు అప్పగించాను. మాకు రిసెప్షన్‌కు ఏం కావాలో, ఎలాంటి డెకరేషన్‌ అవసరమో వాళ్లకు చెప్పాం. మా అభిరుచులకు అనుగుణంగా అన్నీ వారే సమకూర్చారు. డెకరేషన్‌ వగైరాలు కనుల పండువగా ఏర్పాటు చేశారు. అందువల్ల రిసెప్షన్‌ ఎలా జరుగుతుందా? అన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 
–విజయసాయి, విజయవాడ  

ట్రెండ్‌ మారుతోంది..  
వివాహ వేడుకల ట్రెండ్‌ మారుతోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులు తగ్గించి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరిగింది. వెరైటీ వంటకాలు, వినూత్న హంగామాలు, లైవ్‌ మ్యూజిక్‌లు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వేడుక సమ్‌థింగ్‌ స్పెషల్‌గా, స్టేటస్‌ సింబల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు రోబోలు, చీర్‌ గాళ్స్‌ సందడితో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. వారి టేస్ట్‌కు అనుగుణంగా సంస్థలు అన్నీ సమకూరుస్తున్నాయి. 
– విజ్జు విన్నకోట, సెలబ్రిటీ ఈవెంట్స్, విజయవాడ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement