మీరు తప్పులు చేసి.. మా నుంచి రికవరీ ఏంటి? | Employment Guarantee Workers Protest Rural Development Commissioner Office: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మీరు తప్పులు చేసి.. మా నుంచి రికవరీ ఏంటి?

Jun 24 2025 4:45 AM | Updated on Jun 24 2025 4:45 AM

Employment Guarantee Workers Protest Rural Development Commissioner Office: Andhra Pradesh

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు బైఠాయించిన ఉపాధి హామీపథకం ఉద్యోగులు

గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి హామీ సిబ్బంది

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభు­త్వం పెడుతున్న టార్గెట్లతో తాము చేయని తప్పులకు ఆర్థి­కంగా, ఉద్యోగపరంగా బలి కావాల్సి వస్తోందంటూ కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఉపాధి హామీ పథకం పనుల కోసం వచ్చిన శ్రామికులకు రోజుకు రూ.300 తగ్గకుండా వేతనం వచ్చేలా చూడాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు టెక్నికల్‌ సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అందుకు సహకరించని వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.

దీనివల్ల శ్రామికులు పనిచేయకపోయినా రోజుకు రూ.300కు పైగా వేతనం వేస్తుండటం వల్ల కొలతల్లో పొరపాట్లు దొర్లుతున్నాయని పేర్కొన్నారు. ఆ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీల్లో కొలతల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నికల్‌ సిబ్బందిపై చేయని తప్పులకు అభియోగాలు మోపి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్షల రికవరీకి బాధ్యుల్ని చేస్తుండడం అన్యాయమని వాపోయారు. శ్రామికులు ఎంత పనిచేస్తే అంత మొత్తం కూలీ నమోదు చేసేలా సిబ్బందికి స్వేచ్ఛ ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజకు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ రామచంద్రయ్య నేతృత్వంలోని సంఘ ప్రతినిధులతో ఉపాధి హామీ పథకం విభాగం డైరెక్టర్‌ షణ్ముఖకుమార్, ఆడిషనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ చర్చలు జరిపారు. అనంతరం కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ్‌ సంఘ ప్రతినిధులతో భేటీ అయ్యారు. టెక్నికల్‌ సిబ్బందిపై అనవసరమైన అభియోగాలు మోపడం, రూ.లక్షల రికవరీలకు బాధ్యులను చేయడం తదితర అంశాలపై ఆయా విభాగాల సిబ్బందికి తగిన సూచనలు చేస్తానని కమిషనర్‌ హామీ ఇచ్చారని చర్చల అనంతరం జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement