ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో కలకలం
భూ సేకరణ విభాగం అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు
ఉలిక్కిపడిన అధికారయంత్రాంగం
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ జరుగుతున్న సమయంలో ఓ వృద్ధురాలు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ భూసేకరణ విభాగం కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడి అధికారులపై కారం చల్లేందుకు యత్నించింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 65 ఏళ్ల మల్లెంపూడి లక్ష్మీతులసి భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి ఆమెకు 2022వ సంవత్సరంలో రూ.6,51,821 నష్టపరిహారం చెల్లించారు.
అయితే తన నుంచి సేకరించిన భూమి మొత్తానికి సంబంధించి పరిహారం ఇవ్వలేదని, కొంత భాగానికి మాత్రమే ఇచ్చారని లక్ష్మీతులసి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇతరులకు ఎక్కువ విస్తీర్ణానికి పరిహారం చెల్లించారని ఆరోపించింది. పరిహారం కోసం తాను కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తన చేయి విరిగిందని కన్నీరు పెట్టుకుంది. భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న అధికారి తనను ఇబ్బంది పెట్టాడని వాపోయింది. ఈ క్రమంలో సోమవారం పీజీఆర్‌ఎస్ జరగుతున్న సమయంలో కలెక్టరేట్‌కు చేరుకుంది.
అక్కడ భూ సేకరణ విభాగంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కారం ప్యాకెట్ విసిరింది. కారం అంతా బల్లలపై, కుర్చిలపై పడింది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆవరణలో బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. లక్ష్మీతులసికి చెందిన 28 చదరపు మీటర్లు మాత్రమే భూమి సేకరించామని, అందుకు ఆమెకు రూ.6,51,821 పరిహారం కూడా చెల్లించామని కలెక్టర్ జి.లక్ష్మీశకు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం నివేదించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈ విషయాన్ని పునః పరిశీలించాలని నందిగామ తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ మేరకు డీఆర్వో ప్రకటన విడుదల చేశారు.


