కోడిగుడ్డు.. కొత్త రికార్డు

Egg Price In Retail Market Reached 7-Rs Creates New Record - Sakshi

అంతకంతకూ పెరుగుతున్న గుడ్డు ధర

పౌల్ట్రీ చరిత్రలో తొలిసారి రూ.5.54కు చేరిన రైతు ధర 

నాలుగేళ్ల తర్వాత అత్యధికం

రిటైల్‌ మార్కెట్‌లో రూ.7

మండపేట: గుడ్డు ధర అంతకంతకూ పెరుగుతోంది. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గుడ్డు రైతు దగ్గర ధర రూ.5.54కు చేరింది. నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర. మరోపక్క రిటైల్‌ మార్కెట్‌లో గుడ్డు రూ. 7కు చేరడంతో సామా­న్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి తూర్పు­గోదావరి జిల్లాలోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు.

శీతాకా­లంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎగుమతులు పుంజుకొని రైతులకు అత్య­ధిక ధర లభిస్తుంది. 2017వ సంవత్సరం సీజన్‌లో రైతు దగ్గర ధర అత్యధికంగా రూ.5.45 లభించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డు కాలం ఎదు­ర్కొంటోంది. సీజన్‌లో రైతు ధర రూ.5 దాటడం గగన­మైంది. ఈ సీజన్‌లో శీతలం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని గుడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ పెరిగి, ధర పెరిగింది.

ఈ ధర అశాజనకమే అయినప్పటికీ, మేత ధర ఇబ్బడిముబ్బడిగా పెరడంతో ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. కోళ్లకు వేసే వ్యాక్సిన్లు, మందుల ధరలు, కార్మికుల జీతాలు పెరిగిపోవడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని పెంచేసిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది సగటు ధర రైతు దగ్గర రూ.5 ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని, గత ఏడాది సగటు ధర రూ. 4.39 మాత్రమే ఉండటంతో నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. కోడి మేతకు వినియోగించే మొక్కజొన్న, సోయా, నూకలు తదితర వాటిని పౌల్ట్రీలకు రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ధరలు తగ్గితేనే ఊరట 
గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో గుడ్డు అత్యధిక రైతు ధరను నమోదు చేసుకుంది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉన్నా కోడి మేత ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేత రేట్లు అందుబాటులోకి వస్తేనే పరిశ్రమకు ఊరట. కోడి మేతను సబ్సిడీపై పౌల్ట్రీలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 
– పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top