జిరాక్స్‌ కాపీలే కాలేజీలకు ఇవ్వండి

EAMCET‌ Admissions Convener‌ Reference To Engineering‌ Students - Sakshi

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎంసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ సూచన

తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాకే ఫీజులు చెల్లించాలి

తరగతుల క్యాలెండర్‌ విడుదల.. నేటి నుంచి క్లాసులు

క్లాసుల నిర్వహణలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించేలా ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్‌–2020 ద్వారా వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్‌ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎంఎం నాయక్‌ కోరారు. ఈ మేరకు విద్యార్థులకు జారీచేసిన అలాట్‌మెంట్‌ ఆర్డర్లలో పలు సూచనలు పొందుపరిచారు.

ఇలా చేయాలి..
► అభ్యర్థులు ముందుగా అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను ‘ఏపీఈఏఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
► ఆ తరువాత అభ్యర్థి లాగిన్‌ అయి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. 
► తదుపరి జాయినింగ్‌ రిపోర్ట్, అలాట్‌మెంట్‌ ఆర్డర్, రిసీప్ట్‌ ఆఫ్‌ సర్టిఫికెట్లను రెండు కాపీల చొప్పున ప్రింట్‌ తీసుకుని వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి. 
► ఒక కాపీని కాలేజీలో సమర్పించి.. రెండో కాపీపై అకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. 
► ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి రిసీప్ట్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్ని కూడా కాలేజీలో సమర్పించాలి. సీటు కేటాయింపు అయిన అభ్యర్థులు దాన్ని నిలుపుకోవాలంటే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌తో పాటు, కాలేజీలో రిపోర్టు చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ 2021 జనవరి 8. 
► వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్, అనంతరం కాలేజీలో రిపోర్టు చేయని వారి అలాట్‌మెంట్‌ సీటును ఖాళీగా పరిగణిస్తారు. తరువాత కౌన్సెలింగ్‌ సమయంలో మొదటి విడత సీటు కేటాయింపు రద్దవుతుంది. 
► రెండో కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల్లో అర్హులకు దాన్ని కేటాయిస్తారు. 
► విద్యార్హతలకు సంబంధించిన వివరాలు పరిశీలనలో తప్పని తేలితే సదరు అభ్యర్థికి సీటును రద్దుచేయడంతో పాటు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చర్యలు తీసుకుంటారు. 
► అభ్యర్థులు అడ్మిషన్ల సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులనే సమర్పించాలి. 
► ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కేవలం పరిశీలన వరకు అందించి తదుపరి వెనక్కి తీసుకోవాలి. 
► ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అర్హులు కాని అభ్యర్థులు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఆయా కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజులు చెల్లించాలి. 
► తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలుచేయకూడదు.

నేటి నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు
తొలివిడత కౌన్సెలింగ్‌ ముగియడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. కోవిడ్‌–19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది.

ఇదీ క్యాలెండర్‌..
ప్రొఫెషనల్‌ యూజీ కోర్సుల తరగతుల ప్రారంభం : జనవరి 6
ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు : ఏప్రిల్‌ 17
సెకండ్‌ సెమిస్టర్‌ ప్రారంభం : మే 3
సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు : ఆగస్టు 23
థర్డ్‌ సెమిస్టర్‌ ప్రారంభం : సెప్టెంబర్‌ 1  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top