
మహానాడు బహిరంగ సభకు రావాల్సిందేనని హుకుం
గైర్హాజరైతే శిక్ష తప్పదని బెదిరింపులు
ఎవరైనా రాకపోతే వారి తరఫున కూలి ఇచ్చి మనిషిని పంపించాలన్న అధికారులు
సభకు వచ్చిన గ్రూపు సభ్యుల ఫొటో అప్‌లోడ్ చేయాలని ఆదేశం
తరలించకపోతే తొలగిస్తామని యానిమేటర్లకూ హెచ్చరికలు
సాక్షి, రాయచోటి : కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చివరిరోజు బహిరంగ సభకు జనాలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. టీడీపీ కేడర్‌లో అసంతృప్తి, ప్రజలకు ఏడాది కాలంలో ఏమీ చేయలేకపోవడం, సర్కారుపై తీవ్ర వ్యతిరేకత కారణంగా జనం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించేందుకు అల్టిమేటం జారీచేశారు. సభకు వస్తే ఉంటారు, లేకపోతే ఇబ్బందులు తప్పవనే తరహాలో బెదిరిస్తున్నారు.
ఆబ్సెంట్ అయితే పనిష్మెంట్..
అలాగే, రాయలసీమ జిల్లాలోని స్వయం సహాయక సభ్యులందరూ కచ్చితంగా పాల్గొనాలని పెట్టిన వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. ప్రతి గ్రూపులోనూ కనీసం ఏడుగురు వచ్చేలా చూసుకోవాలని డ్వాక్రా లీడర్లకు స్పష్టంగా చెప్పడంతో పాటు ఎవరైనా రాని పక్షంలో వారి స్థానంలో మరో మహిళను కూలీ ఇచ్చి తీసుకురావాలని అల్టిమేటం జారీచేశారు. అంతేకాదు.. మహానాడు చివరిరోజు నిర్వహిస్తున్న బహిరంగసభకు గైర్హాజరైతే కచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. డ్వాక్రా మహిళల మెడపై ఇలా కత్తిపెట్టి తరలిస్తుండటంపై అన్నిచోట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు యానిమేటర్లకు ఒక బస్సు..
డ్వాక్రా మహిళలను తరలించే బాధ్యత యానిమేటర్లకు అప్పగించారు. ఒక యానిమేటర్ పరిధిలో పదుల సంఖ్యలో గ్రూపులు ఉంటాయి కాబట్టి ఇద్దరు యానిమేటర్లకు కలిపి ఒక బస్సును కేటాయించి, అందులో మహిళలను తరలించేలా ప్రణాళిక రూపొందించారు.
పెద్దఎత్తున మహిళలను తరలించే బాధ్యత యానిమేటర్లదేనని, ఎవరు ఇందులో ఫెయిలైనా తమ వారిని యానిమేటర్లుగా పెట్టుకుంటామని పార్టీ నేతలు ఇప్పటికే మౌఖికంగా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. పైగా.. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదన్న విషయంలో గ్రూపు సభ్యులు మహానాడు వద్ద సెల్ఫీ తీసుకుని పెట్టాలని చెప్పడంపై మహిళా సంఘాలు రగిలిపోతున్నాయి.