నిప్పుకు ఇక చెక్‌ | Sakshi
Sakshi News home page

నిప్పుకు ఇక చెక్‌

Published Fri, Jul 21 2023 4:17 AM

Drones and robots for the fire department - Sakshi

సాక్షి, అమరావతి: అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆకాశం నుంచి ఎగురుకుంటూ డ్రోన్లు వచ్చేస్తాయ్‌. మంటలు చెలరేగిన భవనాల్లోకి చకచకా వెళ్లి మంటల్ని అదుపుచేసే రోబోలు సైతం రా­బోతున్నాయ్‌. త్వరలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధునాతన సాధనా సంపత్తిని సంతరించుకోనుంది.

అగ్ని ప్రమాదాలకు తక్షణం చెక్‌ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర అగ్నిమాపక వ్యవస్థను ఆధు­నికీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), అగ్నిమాపక వ్యవస్థలకు ఆధునిక పరికరాలను సమకూర్చేందుకు ప్రణాళికను ఆమోదించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు రూ.295 కోట్లతో కార్యాచరణ చేపట్టింది.  

ఇరుకైన ప్రదేశాలు.. ఎత్తైన భవనాల్లోకీ వెళ్లేలా.. 
రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరాలు, పట్టణాల జనాభా అధికంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా నగర, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. పెద్దపెద్ద ఆకాశ హార్యా్మలు, పలు కంపెనీలు నిర్మాణం సర్వసాధారణంగా మారింది. అటువంటి ఎత్తైన భవనాలు, కంపెనీల కార్యాలయాలతోపాటు నగరాలు, పట్టణాల్లో ఇరుకైన ప్రదేశాల్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారింది.

ఫైర్‌ ఇంజిన్లు, ఇతర అగ్నిమాపక వాహనాలు, పరికరాలను ప్రమాదం సంభవించిన ప్రదేశానికి తీసుకువెళ్లి మంటలను అదుపు చేయడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా కనిష్ట సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక  సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి మొత్తం రూ.295 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

ఇందులో 50 శాతం నిధులతో ఆధునిక అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో అగ్నిమాపక డ్రోన్లు, రోబోలతోపాటు ఎత్తైన భవనాల్లో చెలరేగే మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించే హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫారాలతోపాటు 16 రకాల ఆధునిక పరికరాలు ఉండటం విశేషం. మరో 30 శాతం నిధులతో కొత్త  అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, 20 శాతం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలుగా గుర్తించి వాటిని వినియోగించనుంది.  

కొనుగోలు చేయనున్న పరికరాలు 
అగ్ని మాపక డ్రోన్లు,  అగ్నిమాపక రోబోలు 
హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫారాలు, టర్న్‌ టేబుల్‌ ల్యాడర్లు
♦ ఇరుకు ప్రదేశాల్లోకి వెళ్లగలిగే అగ్నిమాపక మోటారు సైకిళ్లతో కూడిన మిస్ట్‌ ఫైటింగ్‌ యూనిట్లు
♦ హజ్‌మత్‌ వ్యాన్లు, అత్యవసర వైద్య సహాయం అందించే మెడికల్‌ కంటైనర్లు 
♦ లైట్‌ రెస్క్యూ టెండర్లు, మినీ వాటర్‌ టెండర్లు 
 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీ పర్సస్‌ వాహనాలు, రెస్క్యూ బోట్లు 
♦ వాటర్‌ బ్రౌజర్లు, హై ప్రెజర్‌ పంపులతో కూడిన రెస్క్యూ వాహనాలు 
♦ ఫైర్‌ ఫైటింగ్‌ ఫిటింగ్స్, సిబ్బందికి రక్షణ కల్పించే పరికరాలు  

Advertisement
 
Advertisement