షూస్‌ కాదు.. చెప్పులేసుకోవాలి!

Dress Code To NEET Exam - Sakshi

రేపు జరగనున్న ‘నీట్‌’ పరీక్షకు డ్రెస్‌ కోడ్‌

పెద్ద బటన్లు, ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులను అనుమతించరు

బురఖా ధరిస్తే  ముందుగానే కేంద్రానికి రావాలి

జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డ్రెస్‌ కోడ్‌ విధించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. తేలికపాటి, హాఫ్‌ స్లీవ్స్‌ దుస్తులు ధరించి రావాలి. పెద్ద బటన్లు, ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులకు అనుమతిలేదు. బూట్లకు బదులు చెప్పులు, శ్యాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. ఇక అడ్మిట్‌కార్డుతో పాటు గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. 

థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే అనుమతి..
► మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ పరీక్ష జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే విద్యార్థులు, సిబ్బందిని అనుమతిస్తారు. 
► పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవాలి. 
► ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశాల్ని కల్పిస్తారు. 
► పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, బ్యాగులు సహా ఇతరత్రా వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు. 
► పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాలాజలాన్ని వాడరాదు. 
► ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కృష్ణా, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 151 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. 
► 2019లో ఏపీ నుంచి 57,755 మంది దరఖాస్తు చేయగా, ఇప్పుడా సంఖ్య 61,892కు పెరిగింది.
► ఈ ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 2,28,914 మంది పరీక్ష రాస్తుండగా, అత్యల్పంగా మిజోరాంలో 1,741 మంది రాస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top